మక్కా - మదీనాల్లో 24 గంటల కర్ఫ్యూ : సౌదీ సంచలన నిర్ణయం

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇందులో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ దేశంలో పవిత్ర మక్కా, మదీనా మసీదులు ఉండే ఇస్లాం ప్రార్థనా కేంద్రాలు ఉన్నాయి. అయితే, కోరనా వైరస్ మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం ఇప్పటికే అనేక కఠిన నిర్ణయాలు తీసుకుని, ఆంక్షలను అమలు చేస్తోంది.
 
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. మ‌క్కా, మ‌దీనా ప్రాంతాల్లో తిరిగే కార్లలో ఒకే వ్యక్తి మాత్రమే ప్రయాణం చేయాలని స్పష్టం చేసింది. సౌదీలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన వారి సంఖ్య 1,885 చేర‌గా.. 21 మంది మ‌ర‌ణించారు. 
 
వైర‌స్ వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టికే సౌదీ కఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను కూడా విధించింది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మక్కా, మదీనాకు వచ్చేవాళ్లు ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. 
 
అటు ఇప్ప‌టికే ఉమ్రా యాత్ర‌ను ఏడాది పొడవునా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సౌదీ స‌ర్కార్‌.. తాము స్పష్టతనిచ్చేవరకు ట్రావెల్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవద్దని సూచించింది. అయితే  కార్మికులు, ప్రజలు నిత్యావ‌స‌ర స‌రుకులు కొనుగోలు చేయ‌డానికి, వైద్యం కోసం సౌదీ సర్కారు పలు మినహాయింపులు ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భర్త చైన్‌స్నాచర్ ... భార్య అడ్డదార్లు ... ప్రియుడితో కలిసి...