భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈనెల 19వ తేదీన జరిగే సెంట్రల్ బ్యాంకు సమావేశం అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేయవచ్చని ఆన్‌లైన్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ అయిన మనీలైఫ్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
ముఖ్యంగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) స్వయంప్రతిపత్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మితిమీరిన జోక్యంతో ఆయన తీవ్రంగా కలత చెందినట్టు సమాచారం. ముఖ్యంగా, రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామని మోడీ సర్కారు పదేపదే చెబుతోంది. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడదని ఆర్బీఐకు తెలిసినప్పటికీ పెదవి విప్పలేని పరిస్థితి.
ముఖ్యంగా, ఆర్బీఐ ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇవ్వడం వల్లే మొండిబకాయిలు పేరుకునిపోయాయంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా ఉర్జిత్ పటేల్‌ను మనస్తాపానికి గురిచేశాయి. పైగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నప్పటికీ స్వేచ్ఛగా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ వార్తను ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్‌లో మంచి పేరున్న సచ్చేతా దలాల్ రాసి మనీలైఫ్ వెబ్‌సైట్‌లో ప్రచురించారు.