Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది?

మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది?
, మంగళవారం, 2 జులై 2019 (20:21 IST)
ప్రస్తుతం ప్రపంచంలో పురుష గర్భనిరోధక జెల్ (జిగురు) వినియోగిస్తున్న అతికొద్ది మందిలో స్కాట్‌లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన జేమ్స్ ఓవర్స్ ఒకరు. ఈ పురుష హార్మోన్ జెల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 450 జంటల మీద యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ 12 నెలల పాటు అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనంలో 29 ఏళ్ల జేమ్స్ ఓవర్స్ కూడా పాల్గొన్నారు.
 
వీళ్లు వినియోగిస్తున్న జెల్‌లో ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ హార్మోన్లు ఉంటాయి. ప్రొజెస్టిరాన్ హార్మోన్ పురుషుల వృషణాలాల్లో సహజమైన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది. దాంతో, వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. అయితే, ఆ జెల్‌ ద్వారా శరీరంలోకి వెళ్లే కృత్రిమ టెస్టోస్టిరాన్ హార్మోన్... ఆ వ్యక్తిలో లైంగిక ఉత్సాహంతో పాటు, ఆ హార్మోన్‌ మీద ఆధారపడి పనిచేసే ఇతర క్రియలు యథావిధిగా జరిగేలా చూస్తుంది. హిళల గర్భనిరోధక మాత్రలకు ప్రత్యామ్నాయంగా పురుషులకు ఈ జెల్ పనిచేస్తుంది.
 
ఈ జెల్‌ను ఎలా వాడతారు?
"టూత్‌పేస్ట్ ట్యూబులాంటి జెల్ ట్యూబులు దొరుకుతాయి. దాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని భుజం మీద, ఛాతి భాగంలో రాసుకుంటాను. మూడు నాలుగు సెకన్లలో అది ఆరిపోతుంది. తర్వాత మరో భుజానికి రాసుకుని డ్రెస్ వేసుకుంటా. నాకు ఏ సమస్యా లేదు. అంతా మూమూలుగానే ఉంటుంది" అని బీబీసీ రేడియో 5 లైవ్‌ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో జేమ్స్ వివరించారు.
 
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జేమ్స్ ఈ జెల్‌ను వాడుతున్నారు. దీని వాడకం వల్ల తనలో శృంగార వాంఛ ఎక్కువైనట్లు ఆయన చెప్పారు. దానికి మించి ఇతర సమస్యలే పెద్దగా లేవని అన్నారు. "నా మూడ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. వీపు మీద చిన్నచిన్న మచ్చలు ఏర్పడ్డాయి కానీ, ఇప్పుడు అవి లేకుండాపోతున్నాయి. గతంలో పురుష గర్భనిరోధకాల గురించి పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ, ఈ జెల్‌ను ప్రయోగాత్మకంగా వాడిన తర్వాత నాలో సానుకూలమైన మార్పు వచ్చింది" అని జేమ్స్ చెబుతున్నారు.
 
ఫ్రెండ్స్ అడుగుతున్నారు
"నేను దీనిని వాడటం మొదలుపెట్టిన తర్వాత చాలామంది నాతోటి ఉద్యోగులు, స్నేహితులు అనేక విషయాలు అడుగుతుండేవారు. ఆ మందు ఎలా పనిచేస్తుంది? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఈ జెల్ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుంది? అని అడిగేవారు" అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇలాంటి పురుష గర్భనిరోధక మందులు అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన అంటున్నారు.
 
అయితే, ఈ తరహా మేల్ 'పిల్స్' మార్కెట్‌లోకి వచ్చేందుకు ఇంకా కొన్నేళ్లు పడుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్. చెరిల్ పిట్జెరాల్డ్ చెబుతున్నారు."ప్రస్తుత ట్రయల్స్‌లో కొన్ని వందల మంది పురుషులు పాల్గొంటున్నారు. వారిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం పడుతోందా? అన్న విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత మరో భారీ ట్రయల్ ఉంటుంది. ఆ ట్రయల్ పూర్తయ్యేందుకు పదేళ్ళకు పైగా పట్టొచ్చు. ఆ తర్వాతే ఈ జెల్ బహిరంగ మార్కెట్‌‌లోకి వచ్చే వీలుంటుంది" అని డాక్టర్ చెరిల్ చెప్పారు.
 
తాను 16 ఏళ్ల వయసు నుంచీ గర్భనిరోధక మాత్రలు వాడుతున్నానని, ఇప్పుడు తన భాగస్వామి ఈ జెల్ వినియోగిస్తుండటంతో తనకు ఉపశమనం లభించిందని జేమ్స్ జీవిత భాగస్వామి డయానా అంటున్నారు. ఇప్పటి వరకు మార్కెట్‌లో మహిళలకు మాత్రమే గర్భనిరోధక మాత్రలు (పిల్స్) అందుబాటులో ఉన్నాయి. పురుషులు గర్భనిరోధక పద్ధతులు పాటించడం, మందులు వాడటం ద్వారా మహిళలకు ఉపశమనం కలిగించినట్లు అవుతుందని జేమ్స్ అంటున్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో