కర్ణాటక కోలారు జిల్లాలోని ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి వినాయకుడి విగ్రహం పదమూడున్నర అడుగుల ఎత్తు ఉంది.
సుమారు 14 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ప్రతిష్టించారని ప్రతీతి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెబుతుంది. ఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు. మరి ఈ దేవాలయ చరిత్ర ఏంటో, దేవాలయంలో కొలువైన గణపతి యొక్క మహిమలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం తెలుపుతున్నది. శ్రీకృష్ణదేవరాయలువారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వల్ల ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది.
పూర్వకాలంలో దీనిని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమంలో అది కాస్త కురుడుమలెగా పేరుగాంచినదని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఆర్కియాలజీ వారు ఈ గుడి సుమారు 2000 ఏళ్ళ క్రిందటిదని పేర్కొన్నారు. ఈ గుడి మొత్తం ఏక శిలతో నిర్మితమైనది. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకీ ఉన్నారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, అక్కడి వారికి అపారమైన నమ్మకం.
అందుకు ఆధారాలు లేకపోలేదు. కొన్ని రాత్రుళ్ళు అక్కడ ఏవో స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారని అక్కడ పెద్దలు చెబుతుంటారు. విగ్రహం చాలా ఏళ్ల పాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకొనేది. ఆ తర్వాత ఈ విగ్రహానికి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారం ద్వారా రుజువైంది.
ఇక్కడ ప్రాశస్త్యం ఏంటంటే మీరు అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శనం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి. ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు, బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తి అవుతాయని చరిత్ర చెబుతోంది.
మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి దర్శనం దొరకకపోవడం కొసమెరుపు, ఆయన ఆజ్ఞ లేనిదే అక్కడకు వెళ్ళలేము. కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి ఆలయం ఈ ఆలయానికి వంద మీటర్ల దూరంలో ఉంది. కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించిన వారు అనుగ్రహం పొందుతారు.