Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు: నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసి దొరికిపోయారు

Advertiesment
గుంటూరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు: నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసి దొరికిపోయారు
, బుధవారం, 8 జులై 2020 (14:49 IST)
ప్రేమ పేరుతో యువతిని వంచించారు. పైగా రహస్యంగా చిత్రీకరించిన నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఇలా ఒకరు కాదు..ఒకరి తర్వాత ఒకరుగా నిందితులంతా కలిసి బాధితురాలిని వేధించడంతో ఇక సహించలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దాంతో రంగంలో దిగిన గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఇంజనీరింగ్ విద్యార్థుల బండారం బయటపెట్టారు.

 
ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఆధారంగా కూపీ లాగి అసలు గుట్టు రట్టు చేశారు. తొలుత ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. గుంటూరులో సంచలనం రేపిన ఈ కేసులో నిందితులంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.

 
మూడేళ్ల నుంచి వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి..
మూడేళ్లుగా వేధిస్తున్నారు. అయినా సహించింది. ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయంతో వంచించినా ఏం చేయాలో తోచని స్థితిలో ఊరుకుంది. కానీ చివరకు ఆమె నగ్న చిత్రాలను రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అల్లరి చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. గుంటూరు అర్బన్ జిల్లా దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జూన్ 27న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వరుణ్, కౌశిక్ అనే ఇంజనీరంగ్ విద్యార్థుల అఘాయిత్యాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ప్రేమ పేరుతో కౌశిక్ మోసం చేస్తే, ప్రేమించలేదనే కక్షతో వరుణ్ ఈ నేరాలకు పాల్పడినట్టు ఆధారాలు లభించడంతో వారిని అరెస్ట్ చేశారు.

 
కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి..
2017లో కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలోనే ఆ బాలికను మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపిన తర్వాత రహస్యంగా నగ్న వీడియోలు, ఫోటోలు చిత్రీకరించినట్టు గుర్తించారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తూ ఆమెను మోసగించారు.

 
ఈ వ్యవహారంలో పలువురి హస్తం ఉండడంతో కలవరపడి అన్నీ సహించిన బాధితురాలు ఆఖరికి ధైర్యం చేయడంతో విషయం బయటకు వచ్చింది. మూడేళ్ల పాటు వేధింపుల పర్వం కొనసాగిన అనంతరం జూన్ 26న బాధితురాలు తన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొలుత ఇద్దరిని అరెస్ట్ చేసి, మరింతో లోతుగా ఆరా తీశారు పోలీసులు. ఆ క్రమంలో మరింత మంది పాత్రధారులు బయటపడ్డారు. అందులో ప్రధాన నిందితులకు సహకరించడం, సోషల్ మీడియాలో ఈ చిత్రాలు పోస్ట్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 
'నేను 420' పేరుతో ఇన్‌‌స్టా అకౌంట్
ఇన్‌స్టాగ్రామ్‌లో 'నేను 420' అనే అకౌంట్ నుంచి బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె వీడియెలు, ఫోటోలు పంపించి పబ్లిక్‌లో పెడతామంటూ బెదిరించారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా మణికంఠ, ధనుంజయ రెడ్డి, తులసి కృష్ణ, భాస్కర్, కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ లను పోలీసులు గుర్తించారు. ఈ ఏడుగురు నిందితులను జూలై 6వ తేదీన అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ అరెస్టులపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ "బాధితురాలిని ప్రేమ పేరుతో వంచించారు.

 
పైగా ఆమె నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న కౌశిక్ ద్వారా సదరు యువతి నగ్న చిత్రాలు భాస్కర్ అనే అతని స్నేహితుడికి, అతని ద్వారా ధనంజయ రెడ్డికి, అతని ద్వారా తులసి కృష్ణ, మణికంఠలకు అక్కడ నుండి కేశవ్, క్రాంతి కిరణ్‌లకు అక్కడ నుండి రోహిత్‌కి చేరాయి.

 
వీరిలో మణికంఠ, ధనుంజయ్ రెడ్డిలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ యువతికి పంపి, వాటితో ఆమెను బెదిరించారు. అనుభవించాలని భావించారు. తదుపరి మిగిలిన ఐదుగురుతో విషయాలు పంచుకోగా వీరి తర్వాత మిగిలిన ఈ ఐదుగురు కూడా ఆమెను అనుభవించాలనే కోరికతో వేధించారు.

 
మణికంఠ అనే నిందితుడు ఇంజనీరింగ్ మధ్యలో మానేశాడు. అతనే ‘నేను420’ అనే ఫేక్ అకౌంట్‌ని క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ యువతితో ఛాటింగ్ చేశాడు. తమ కోరిక తీర్చకపోతే రూ. 50వేలు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దానికి ఆ యువతి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా అడగటంతో, నిందితులు దొరికిపోతామన్న భయంతో మిన్నకుండిపోయారు. పోలీసుల దృష్టికి ఈ కేసు రాగానే స్పందించి, నిందితులను గుర్తించాం. ఇప్పటి వరకూ పక్కా సాక్ష్యాధారాలతో తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు.." అంటూ వివరించారు.

 
ఇన్‌స్టా అకౌంట్ ఎలా గుర్తించారు..
'నేను420' ఇన్‌స్టా అకౌంట్‌ని 2017లో క్రియేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కానీ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు సాగించారు. ఈ కేసులో గుంటూరు అర్బన్ పోలీస్ విభాగం టెక్నికల్ ఎనాలసిస్ వింగ్ ఎస్ ఈ విశ్వనాథ రెడ్డి, ఆయన బృందం కీలక పాత్ర పోషించారు.

 
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, వాట్సాప్ ద్వారా షేర్ కూడా చేసిన నేపథ్యంలో వాటిని వెలికి తీసేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నించింది. ఆధారాలను సేకరించింది.

 
ఇన్‌స్టా అకౌంట్‌ను నిందితుడు పాత ఫోన్ నెంబర్‌తో క్రియేట్ చేశాడు. అతను రెగ్యులర్‌గా వాడేందుకు వేరే అకౌంట్ కూడా ఉంది. 2017లో క్రియేట్ చేసిన నేను 420 అకౌంట్ కోసం వాడిన మొబైల్ నెంబర్‌ని ఇప్పుడు నిందితుడు వినియోగించడం లేదు. ఇప్పటికే అది ఇద్దరు ముగ్గురు వినియోగదారుల వద్దకు మారిపోయి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎవరో వినియోగిస్తున్నట్టు గుర్తించారు.

 
కానీ కేసుకి, వారికి ఎక్కడా సంబంధం లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సి వచ్చింది. తన పాత నెంబర్ ఇప్పుడు గుర్తు పట్టలేరనే ధైర్యంతోనే ఆ అకౌంట్ నుంచి బ్లాక్ మెయిల్ చేసేందుకు వాడుకున్నట్టు పోలీసులు అంచనా వేశారు.

 
దానికి అనుగుణంగా వివరాల్లోకి వెళితే ఇన్‌స్టా అకౌంట్‌లో వాడిన జీమెయిల్ ఐడీలో ఒక ఫోన్ నెంబర్ ఉంది. దానిని ఇన్‌స్టా నుంచి సేకరించిన సమాచారంతో ఆరా తీస్తే అది ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఆ నెంబర్ ఉందని తేలడంతో ఎయిర్ టెల్ నుంచి ఐపీడీఆర్(ఇంటర్ నెట్ ప్రోటోకాల్ డీటైల్డ్ రిపోర్ట్) తీసుకున్న పోలీసులకు మరింత పగడ్బందీ ఆధారాలు లభించాయి.

 
లాగిన్ అయిన నెంబర్ నిందితుడు మణికంఠ తల్లి పేరుతో ఉన్నట్టు గుర్తించారు, ఇంటర్నెట్ వినియోగం కూడా జరిపిన ఆమె మొబైల్ నుంచి ఇన్‌స్టాలో లాగిన్ అయినట్టు తేలింది. ఇక పాత ఇన్‌స్టాలో ఉన్న నెంబర్ కస్టమర్ అప్లికేషన్ ఫారం సేకరించిన పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి.

 
అందులో నెంబర్ నిందితుడు మణికంఠ తండ్రిదేనని తేలింది. తండ్రి నెంబర్ ద్వారా ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసి, తల్లి మొబైల్ నుంచి డేటా వినియోగించి లాగిన్ అయినట్టు నిర్ధారించుకున్న తర్వాత తెనాలికి చెందిన నిందితుడిని అరెస్ట్ చేయడంతో మరింత సమాచారం లభించింది. సహ నిందితులను గుర్తించడానికి వీలు కలిగింది.
webdunia

 
సైబర్ నేరాలకు పాల్పడితే సహించేది లేదు..
ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా, సోషల్ మీడియా సహాయంతో పాల్పడుతున్న సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించబోతున్నట్టు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేసులో నిందితులుగా ఉన్న వారిపై ఫోక్సో చట్టం సహా వివిద నేరాలు నమోదయిన నేపథ్యంలో రౌడీ షీట్ తెరవబోతున్నట్టు వెల్లడించారు.

 
"స్కూల్స్ మరియు కాలేజీలలో చదువుకునే యువత టెక్నాలజీని ఉపయోగించే విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుడు మార్గాల లోనికి వెళ్లి తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోవద్దు. ఎవరూ గుర్తించరులే అన్న ఉద్దేశంతో ఫేక్ నంబర్ల ద్వారా, ఫేక్ అకౌంట్స్ ద్వారా ఇతరులకు చేసే తప్పుడు మెసేజీలు/ పోస్టింగ్స్ నుంచి తప్పించుకోలేరు. అలాంటి తప్పిదాలకు దూరంగా ఉండండి. విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత తీసుకొని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది" అంటూ సూచించారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దారుణం, మహిళను కత్తులతో పొడిచి చంపుతుంటే వీడియోలు తీస్తూ చోద్యం చూశారు