Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికలు 2021: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన రాజకీయ సందేశం ఏమిటి?

Advertiesment
ఎన్నికలు 2021: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన రాజకీయ సందేశం ఏమిటి?
, మంగళవారం, 4 మే 2021 (12:05 IST)
పశ్చిమ బెంగాల్‌లో తగిలిన ఎదురుదెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలో చాణక్యుడిగా పేరు పొందిన హోం మంత్రి అమిత్ షా విచారిస్తూ కూర్చున్నారా? లేక అసోంలో గెలిచామని ఊరట చెందుతున్నారా? బెంగాల్‌లో మమతా బెనర్జీ శిబిరంలో, కేరళలో ఎల్‌డీఎఫ్, తమిళనాడులో డీఎంకే శిబిరాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బెంగాల్‌లో బీజేపీ ప్రచారం చేసిన విధానం ఆ పార్టీ మద్దతుదారుల్లో విజయం ఖాయమనే నమ్మకాన్ని పెంచింది.

 
కానీ, ఎన్నికల ఫలితాలు వారి అంచనాలకు విరుద్ధంగా రావడంతో బీజేపీ పెద్దలంతా విచారంలో మునిగి ఉండొచ్చు. కానీ, మరో కోణం నుంచి చూస్తే, 2016 ఎన్నికలతో పోలిస్తే బెంగాల్‌లో బీజేపీ సత్తా మూడు సీట్ల నుంచి 77 సీట్లకు పెరగడం ఆ పార్టీకి గర్వకారణం కావొచ్చు. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయి.

 
బెంగాల్ ఫలితాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న "ఫైటర్" ఇమేజ్‌ను బలోపేతం చేశాయి. ఆమె, తన రాజకీయ జీవితంలో ఎదురైన అతి పెద్ద సవాలును అధిగమించి బలంగా నిలబడగలిగారు. తన సహచరులు కొందరు పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారు గానీ ఓటర్లు ఆమెను విడిచిపెట్టలేదు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి 2011లో, 2016లో 44 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎదురు దెబ్బ తగిలి, లోక్‌సభలో సీట్లు తగ్గినప్పటికీ ఆ ఎన్నికల్లో టీఎంసీ ఓట్ల శాతం తగ్గలేదు.

 
ప్రస్తుతం జరిగిన ఎన్నికల ఫలితాలు చూసినా కూడా టీఎంసీ మద్దతుదారుల్లో మమతా బెనర్జీపై ఉన్న విశ్వాసం తగ్గలేదని స్పష్టమవుతోంది. టీఎంసీ ఘన విజయాన్ని పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటివారు మమతా దీదీకి శుభాకాంక్షలు తెలిపారు.

 
'దీదీ ఓ దీదీ' అంటూ ఎగతాళి Vs మమతా కాలికి కట్టిన కట్టు
ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక ర్యాలీల్లో ప్రధాని మోదీ... మమతా బెనర్జీని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. "దీదీ ఓ దీదీ... బెంగాల్ ప్రజలు మీ మీద ఎంత భరోసా ఉంచారో" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బహుశా ఓటర్లకు ఇది నచ్చకపోయి ఉండొచ్చు. "ప్రధాని మహిళలను అవమానించారు" అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు.

 
మరోవైపు, నందిగ్రామ్‌లో ఓ చిన్న సంఘటనలో మమతా కాలికి గాయమైంది. ఆమె కాలికి ప్లాస్టర్ వేసి కట్టు కట్టారు. ఆ తరువాత ఆమె వీల్ చెయిర్‌లో కూర్చునే ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ "మమతా నాటకాలు" అని బీజేపీ ఆక్షేపించింది. ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు ఇది సులువైన మార్గం అని ఎగతాళి చేసింది. ఆ సందర్భంలో బెంగాల్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు రంజన్ ముఖోపాధ్యాయ బీబీసీతో మాట్లాడుతూ, "దీదీ గెలిచేశారు. ఈ ఇమేజ్ ఆమెకు ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెడుతుంది" అని అన్నారు.

 
చాణక్యుడి నీతి పని చేయలేదా?
తమ పార్టీ లక్ష్యం 200 సీట్లు అని, అది తప్పక నెరవేరుతుందని అమిత్ షా ఢంకా బజాయించి మరీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. బీజేపీకి మద్దతు ఇచ్చే టీవీ ఛానళ్లు అన్నీ తాన అంటే తందానా అన్నాయి. 200 సీట్లు ఎలా సాధించగలవో విశ్లేషించి చూపించాయి. అయితే అపర చాణక్యుడిగా పేరు పొందిన అమిత్ షా రాజకీయ చతురత ఫలించలేదు.

 
ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్‌లో గెలిచి తీరాలని బీజేపీ కంకణం కట్టుకుంది. గత ఏడాది డిసెంబర్ నుంచే తన దృష్టినంతా బెంగాల్ ఎన్నికల ప్రచారంపై కేంద్రీకరించింది. ఎన్నికలు దగ్గర పడుతుండగా బీజేపీ ప్రచారం జోరందుకుంది. ఎనిమిది విడతల్లో జరిగిన ఎన్నికల మధ్యలో కూడా మోదీ, షా ర్యాలీలు నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ర్యాలీలు ఆపకుండా కొనసాగించారు. ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖ మంత్రులు, ఎంపీలు బెంగాల్ చుట్టూ తిరగడం ప్రారంభించారు.

 
విభజన రాజకీయాలు పని చేయలేదు
శువేందు అధికారితో సహా అనేకమంది నాయకులు టీఎంసీని విడిచి బీజేపీలో చేరడం చాలా ముఖ్యమైన విషయంగా ఆ పార్టీ భావించింది. టీఎంసీ విచ్ఛిన్నం అయిపోతుందనే భావన ప్రజలకు కలిగించే ప్రయత్నం చేసింది. అంతకుముందు మహారాష్ట్రలో కూడా ఇదే తంతు జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన కొందరు బీజేపీలో చేరారు. అదే అదనుగా, ఎన్‌సీపీ విచ్ఛిన్నం అయిపోతోందని బీజేపీ ప్రచారం చేసింది.

 
కానీ, ఎన్నికల ఫలితాల తరువాత ఎన్‌సీపీ మరింత బలమైన పార్టీగా అవతరించింది. టీఎంసీ నుంచి వెళ్లపోయినవారికి ఆశించిన ఫలితం దక్కలేదని కోల్‌కతాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు అరుధంతి బెనర్జీ అన్నారు. అలాగే, ఎన్నికల ముందు అసదుద్దీన్ ఒవైసీ బరిలోకి దిగడం కూడా టీఎంసీకి ఏ రకమైన హానీ కలిగించలేదని బెనర్జీ అభిప్రాయపడ్డారు.

 
నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా నిలిచిన శువేందు అధికారి ఆమెను "బేగం" అని పిలుస్తూ ముస్లిం నాయకురాలిగా చూపించేందుకు ప్రయత్నించారు. పాకిస్తాన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. "మేం నందిగ్రామ్ వెళ్లినప్పుడు అక్కడ విభజన రాజకీయాలు జరిగాయని మాకు అర్థమైంది. నందిగ్రామ్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో హిందూ-ముస్లిం ఓటర్ల విభజన జరిగింది. కానీ, ఓటర్లు ఈ విభజన రాజకీయాలకు చెక్ పెట్టారు" అని అరుంధతి బెనర్జీ అన్నారు.

 
కాంగ్రెస్ పతనం కొనసాగుతోంది
ఈసారి బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ పార్టీల పరిస్థితి మరింత దిగజారింది. కేరళలో యూడీఎఫ్‌కు నాయకత్వం వహించిన కాంగ్రెస్... అధికారంలోకి రావడం చాలా ముఖ్యం అని భావించింది. ఎల్‌డీఎఫ్ అనేక అవినీతి ఆరోపణల్లో చిక్కుకుందని, ఈసారి తమ గెలుపు ఖాయమని కొందరు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో బీబీసీతో అన్నారు.

 
అయితే, ఎల్‌డీఎఫ్ కచ్చితంగా విజయం సాధిస్తుందని, అదే జరిగితే యూడీఎఫ్ నుంచి నేతలు ఇతర పార్టీలకు జంప్ అయిపోతారని ఎన్నికలకు ముందే కొందరు రాజకీయ నిపుణులు విశ్లేషించారు. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కేరళలో పది సంవత్సరాలపాటు అధికారానికి దూరం కాబోతోంది. ఆ పరిస్థితి పార్టీలో అసంతృప్తిని, నిస్సహాయతను పెంచే అవకాశం ఉంది.

 
ఈ అపజయం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే. ఎందుకంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కేరళలో 20 స్థానాలకు గాను 19 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ తమిళనాడులో డీఎంకేతో జత కట్టి అధికారంలోకి రావడమైతే వచ్చింది కానీ అక్కడ ఆ పార్టీ చిన్న ప్లేయర్ మాత్రమే. పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్‌కు షాకే ఎదురైంది. అసోంలో మరో ఐదేళ్లపాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక సీటీ స్కాన్‌... 400 ఎక్స్‌రేలు తీసుకున్నంత ప్రమాదం: ప్రెస్ రివ్యూ