Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోనల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారు, బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు

Advertiesment
Donald Trump
, మంగళవారం, 24 నవంబరు 2020 (15:12 IST)
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టేందుకు లాంఛనప్రాయమైన ప్రక్రియను ప్రారంభించడానికి డోనల్డ్ ట్రంప్ అంగీకరించారు. కీలక అధికార యంత్రాంగం 'ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను సవాలు చేయడమూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. జో బైడెన్ 'విజేతగా కనిపిస్తున్నారు' అని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) తెలిపింది.

 
అంతకుముందు, అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో కూడా బైడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. ట్రంప్‌కు ఈ ఓటమి తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. అధికార మార్పిడి ప్రక్రియను ప్రారంభించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు బైడెన్ బృందం ప్రకటించింది. "ఈరోజు తీసుకున్న నిర్ణయం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు ఎంతో అవసరం. కరోనా మహమ్మారిని అదుపు చేయడం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం మన ముందున్న సవాళ్లు" అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. "ఈ తుది నిర్ణయం అధికార మార్పిడిని ఫెడరల్ ఏజెన్సీల ద్వారా లాంఛనంగా ప్రారంభించడానికి అధికార యంత్రాంగం చేపట్టిన కీలక చర్య" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 
ట్రంప్ ఏమన్నారు?
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి అధికారాన్ని బదలాయించే బాధ్యతను జీఎస్ఏకు అప్పగించినట్లు, ఆ విషయాన్ని బైడెన్ బృందానికి తెలిపినట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నేతకు 63 లక్షల డాలర్ల నిధులను అందుబాటులో ఉంచుతున్నామని అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ అన్నారు. ఎన్నికల ఫలితాల మీద "పోరు" కొనసాగుతుందని చెబుతూనే, "దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార మార్పిడికి సంబంధించిన ప్రోటోకాల్స్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమిలీకి, ఆమె బృందానికి సూచిస్తున్నా. అలాగే, నా బృందానికి కూడా అదే విషయాన్ని చెప్పాను" అని అధ్యక్షుడు అన్నారు.

 
"వేలాది సమస్యలు ఉన్నప్పటికీ నేను చట్టబద్ధంగా వ్యవహరించేందుకు కట్టుబడి ఉన్నాను" అని ట్రంప్ అన్నారు. అయితే, అధికార మార్పిడి ప్రక్రియను వెంటనే ప్రారంభించనందుకు అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ రెండు రాజకీయ పక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్నికల ఫలితాలకు, అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి మధ్య వెనువెంటనే తీసుకోవలసిన చర్యలను ఆమె చేపట్టలేదనే ఆరోపణలు వినిపించాయి.

 
ఈ ఆలస్యంపై చట్ట ప్రతినిధులకు సోమవారం నాడు వివరణ ఇవ్వాలని ప్రతినిధుల సభలోని డెమొక్రాట్లు ఆమెకు గడువు ఇచ్చారు. కానీ, మర్ఫీ సోమవారం ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రంప్ సహచర రిపబ్లికన్లు కూడా అధికార మార్పిడి గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పారు. రిటైర్ కాబోతున్న టెనెస్సీ సెనేటర్ లామర్ అలెగ్జాండర్ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ట్రంప్ అన్నింటికన్నా దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి" అని అన్నారు. బైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. "ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, మనం చివరగా ఏం చేశామన్నదే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు" అని అలెగ్జాండర్ అన్నారు.

 
మిషిగన్‌లో ఏం జరిగింది?
మిషిగన్ స్టేట్ బోర్డు ఆఫ్ కేన్వాసర్స్‌లోని ఇద్దరు రిపబ్లికన్లలో ఒకరు ఎన్నికల ఫలితాలను తుదిగా ఖరారు చేసే ఇద్దరు డెమొక్రట్లతో సమావేశానికి హాజరయ్యారు. మరొక రిపబ్లికన్ బోర్డు సభ్యులు నార్మన్ షింకిల్ హాజరు కాలేదు. బైడెన్ ఈ రాష్ట్రాన్ని 1,50,000 పైచిలుకు ఓట్లతో గెల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్: ‘పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించమని చెప్పినా... దుష్ప్రచారం చేస్తున్నారు’ - ప్రెస్ రివ్యూ