జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. జనసేన కాస్త మోడీ భజనసేనగా మారిపోయిందన్నారు.
ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు. నిజంగా అది జనసేన పార్టీయా, లేక కేటీఆర్ అన్నట్టు మోడీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు.
ఎందుకంటే తన పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని, ఏంజరిగినా తాను చూసుకుంటానని అన్నారని వెల్లడించారు. కానీ ఈ రాష్ట్రం అతలాకుతలం అయిందని, మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు అయ్యాయని గుర్తుచేశారు.
'అనేక సమస్యలకు చంద్రబాబు కారణం అయినా, ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదు. ఇవాళ గ్రేటర్ ఎన్నికల్లో చూస్తే బీజేపీ కోసం జనసేన తప్పుకుంది. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి వైదొలిగారు.
ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడు? తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా? గ్రేటర్‌లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని రోజా ప్రశ్నించారు.