తనను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై బాలీవుడ్ నటి సోనా మొహపాత్రా విరుచుకుపడింది. నా అందం.. నా ఇష్టం.. నేను. ఏం చూపిస్తే మీకేంటి అంటూ మండిపడింది. నా శరీరం.. నా క్లీవేజ్.. నాకు నచ్చినట్టుగా నేను చూపిస్తా.. మీకేంటి నష్టం అంటూ ప్రశ్నించింది.
గతంలో బాలీవుడ్‌లో సాగిన మీటూ ఉద్యమ సమయంలో సోనా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా 'ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్' పేరుతో ఓ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. బాధితులనే దోషులుగా చేసిన సంఘటనల గురించి వెల్లడించాలని పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో గతంలో తానెదుర్కొన్న సంఘటనను తెలిపింది. "నేను బీటెక్ చదువుతున్న రోజులవి. సల్వార్ దుస్తులు ధరించి మైక్రోప్రాసెస్ ల్యాబ్‌కు వెళ్తున్నా. అక్కడ ఉన్న సీనియర్లు నా లోదుస్తుల గురించి అందరికీ వినబడేలా కామెంట్లు చేశారు. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. 'ఎక్స్‌పోజింగ్ చేయకుండా చున్నీ సరిగా వేసుకోవచ్చు కదా!' అని సలహా ఇచ్చాడ"ని పేర్కొన్నారు.
ఈ సంఘటన గురించి స్పందించిన ఓ నెటిజన్.. 'అందరి దృష్టినీ ఆకర్షించేందుకు, సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత బాధపడిపోతున్న మీరు హాట్ హాట్ ఫొటో షూట్లలో ఎందుకు పాల్గొంటున్నారు. క్లీవేజ్ బాగా కనబడే ఫొటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మానేసి పాటలు పాడడంపై దృష్టి సారించండ'ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన సోనా.. "ఎందుకంటే.. నా శరీరం.. నా క్లీవేజ్.. నాకు ఎలా నచ్చితే అలా ఉంటాన"ని ఘాటుగానే రిప్లై ఇచ్చింది.