Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండాకాలంలో వాన చినుకులు, అబ్బ ఎంత అందంగా వుంటాయో, కానీ ఈ కరోనా కాలంలో?

Advertiesment
ఎండాకాలంలో వాన చినుకులు, అబ్బ ఎంత అందంగా వుంటాయో, కానీ ఈ కరోనా కాలంలో?
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (22:19 IST)
ప్రకృతి మనిషికి ఎన్ని ఆనందాలను పంచుతుందో లెక్కేలేదు. కానీ ఆ ప్రకృతికి విరుద్ధంగా మానవుడు ప్రవర్తిస్తే మటుకు ఏదో ఉపద్రవం రూపంలో విరుచుకుపడుతుంది. అదే ఇప్పటి కరోనా వైరస్. పేరు ఏదైనా ప్రళయం ఒక్కటే. కాకపోతే కనపడకుండా కాటు వేయడం ప్రకృతి తనకు తనే సాటి. 
 
సర్లే... ఆ సంగతి అలా వుంచితే, ఇవాళ దాదాపు చాలాచోట్ల ఓ మోస్తరు వర్షం చినుకులు పడ్డాయి. కరోనా వైరస్ కల్లోలంతో చమట్లతో ఇళ్లలోనే ఉక్కతో వుడికిపోతున్న ప్రజలకు వరుణదేవుడు చల్లగా చినుకులతో పలుకరించాడు. ఇలాంటి వానలు కురిసినప్పుడే మన చిన్నప్పుడు ఎలా వుండేదీ... అనేది గుర్తుకు వస్తుంది.
 
ఎండాకాలం కనుక విశాలమైన ప్రాంతాల్లో ఓ గోళీకాయలో, గాలి పటాలో, చెట్ల మధ్యన కోతికొమ్మచ్చిలో, ఇవేవీ కాదంటే తొక్కుడు బిళ్ల, కుందుళ్లు ఆట ఇలా ఎన్నో ఆటలు. అలా ఆడుతుండగానే నల్లని మేఘాలు ఒక్కసారిగా భగభగలాడే సూర్యుడిని కమ్మేయడం, ఎక్కడో దూరంగా తాటితోపులు, సర్విచెట్లపై ధబధబామంటూ పడే వాన చినుకుల హోరును ఇట్టే పసిగట్టి పిల్లలంతా గుబురు చెట్ల కిందకు పరుగులు పెట్టడం, ఆ తర్వాత ఓ పావుగంటో, అర్థగంటో వాన చినుకులు అలా భూమిని తడిపేస్తుంటే, ఆ భూమి నుంచి వచ్చే మట్టి వాసన అదో అనుభూతిని ఇచ్చేది.
 
ఇక చెట్లపై పక్షులు రెక్కలు విదుల్చుకుంటూ మళ్లీ మేతకు బయలుదేరటం, ఆకాశంలో తమలో నింపుకున్న నీటినంతా భూమిపైకి విదిల్చేసి మేఘాలన్నీ అంతర్థానమవడం, మళ్లీ సూరీడు పలుకరించడం. ఆ సూరీడి వేడిమి, భూమిపై పడిన చినుకుల తడికి మధ్యనే ఓ మధురమైన వాతావరణంలో అలా ఆడుకున్న రోజులు ఎన్నో. మరి ఈ కరోనా కాలంలోని ఎండను కప్పేస్తూ వచ్చిన వానలో హుషారుగా చిందులేసినవారు ఎందరో కదా. ఏమో ఈ వాన చినుకులే కరోనాను కప్పేసేందుకు వచ్చాయో... ప్రకృతికి కోపం తెలుసూ, అలాగే కాపాడటమూ తెలుసు. అందుకే ఓ ప్రకృతీ... నీకు శతకోటి వందనాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరివేపాకు గుజ్జును ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే..?