Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్తగా వచ్చిన కరోనా వైరస్, ఇంకా వేసవిలో వచ్చే వ్యాధులేంటి?

కొత్తగా వచ్చిన కరోనా వైరస్, ఇంకా వేసవిలో వచ్చే వ్యాధులేంటి?
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (23:09 IST)
ఇపుడు కొత్తగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. మరోవైపు వేసవి ప్రారంభం కావడంతో ఈ కాలంలో హీట్ హైపర్ పైరెక్సియా, పొంగు (మీజిల్స్), ఆటలమ్మ (చికెన్ ఫాక్స్), టైఫాయిడ్, డయేరిలా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వడదెబ్బ కూడా ఎక్కువగా బాధిస్తుంది. 
 
ఎండలో ఎక్కువ సమయం తిరగటంవల్ల నీరు, లవణాలు చెమట ద్వారా బయటికి పోవటంతో వడదెబ్బకు గురవుతారు. వేసవిలో ప్రధానంగా ప్రబలే అతిసార, పచ్చకామెర్లు లాంటి వ్యాధులపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
 
వేసవిలో వచ్చే పచ్చ కామెర్లు (జాండీస్) వ్యాధి చాలా ప్రమాదకరం. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని ఈ పచ్చకామెర్ల వ్యాధి అతి సూక్ష్మమైన క్రిములవల్ల సోకుతుంది. 10 నుంచి 20 రోజలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత జ్వరం, ఆకలి లేకపోవటం, కొవ్వు పదార్థాలను తినలేని పరిస్థితి ఏర్పడటం లాంటి లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. కాబట్టి వేసవిలో ఈ లక్షణాలను గమనించినట్లయితే ప్రారంభంలోనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
 
నీళ్ల విరేచనాలు (అతిసార) వ్యాధిపట్ల కూడా వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటంవల్ల నీళ్ల విరేచనాల బారిన పడుతుంటారు. ఈ సమస్యవల్ల ఎక్కువగా విరేచనాలు అవటంవల్ల రోగులు నీరసించిపోతారు. వెంటనే అప్రమత్తమై తగిన చికిత్సను అందించకపోతే.. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశం లేకపోలేదు.
 
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వడదెబ్బ. వేసవిలో ఈ వడదెబ్బకు గురికానివారు చాలా అరుదు. తీవ్రమైన ఎండవేడిని భరించలేనివారు ఈ వడదెబ్బ బారిన పడుతుంటారు. ఈ సమస్య వచ్చినట్లయితే 104 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం, శరీరమంతా వేడిగా, పొడిగా, ఎర్రగా కందిపోతుంది. అలాగే నాడీ వేగంగా కొట్టుకోవటం, రక్తపోటు పడిపోవటంలాంటివి వడదెబ్బ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యకు గురైనవారిపై చల్లని నీటిని చల్లుతూ, గాలి బాగా వచ్చేటట్లుగా చూడాలి.
 
వేసవిలో ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పై వ్యాధులు, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలేంటంటే.. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి వెళ్లటానికి ముందుగానే సన్‌స్క్రీన్ లోషన్‌ను చర్మానికి రాసుకోవాలి. కూల్ డ్రింక్‌లను పక్కనపెట్టి సహజసిద్ధంగా లభించే నీరు, కొబ్బరినీరు త్రాగటం మంచిది.
 
ప్రతిరోజూ 4 లీటర్లకు తగ్గకుండా మంచినీటిని తప్పనిసరిగా తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు లేదా హెల్మెట్ ధరించాలి. ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూడాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను ఎండలో బయటికి తీసుకెళ్లేటప్పుడు కళ్లకు అద్దాలు, తలపై టోపీ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదలని పొడిదగ్గు, ఏం చేయాలి?