ఇంటి నిర్మాణంలో స్థలాలు ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంటి స్థలాన్ని వాస్తురీత్యా ఎంపిక చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు దరిచేరుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. స్థల ఎంపికలో ఏదేని లోపమున్నట్లైతే అశుభ ఫలితాలు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమానులకు అశాంతి కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు. ఇకపోతే వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాన్ని కొనకూడదని పరిశీలిస్తే...
ఈశాన్యము తగ్గిన స్థలాలను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశావృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంది. స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి మన స్థలంలోకి పారకుండా విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు. రెండు విశాలమైన స్థలాల మధ్యనున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు.
ఇలాంటి స్థలాల్నికొనాలి:
ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనడం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఉత్తర - ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగజేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. తూర్పు- ఈశాన్యం, ఉత్తరం - ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనడం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.