కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్‌లో రైతన్నపై వరాల జల్లు కురిపించారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగంలో సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. జీడీపీలో రుణాల శాతం 48.7 తగ్గిందన్నారు. అలాగే నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించడం జరిగిందన్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 20-21ను ప్రవేశపెట్టారు.
ఆరు లక్షలకు పైగా రైతులు ఫసల్ బీమా యోజనతో లబ్ది పొందుతున్నట్లు, కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మొదటి ప్రాధాన్యాశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, రెండోది ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు, మూడోది విద్య, చిన్నారుల సంక్షేమం, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై తాము దృష్టి సారించామన్నారు.
రైతులకు సోలార్ పంప్ సెట్ల పథకాన్ని మరో 20 లక్షల మంది రైతులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. సాగులేని భూముల్లో సోలార్ కేంద్రాలను ఉపయోగించడం వల్ల రైతులకు ఆదాయం వస్తుందన్నారు. నాబార్డు ద్వారా ఎస్ఎస్‌జీలకు సాయం అందిస్తామని, కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన, వర్షా భావా జిల్లాలకు అదనంగా నిధులు ఇస్తామన్నారు.
రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం, గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా సహయం అందిస్తామన్నారు. పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం, మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు చేస్తామని విత్తమంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు.