Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన పౌరసత్వ చట్టం ఏం చెబుతోంది?

మన పౌరసత్వ చట్టం ఏం చెబుతోంది?
, శనివారం, 21 డిశెంబరు 2019 (13:33 IST)
అసలు పౌరసత్వం అంటే ఏంటి. పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏంటి. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం అనే తేనెతుట్టెను కదిపింది. ఇది దేశ వ్యాప్తంగా రాజుకుంది. అనేక రాష్ట్రాల్లో అశాంతి నెలకొంది. ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ఆందోళనలు మిన్నంటివున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మన పౌరసత్వ చట్టం ఏం చెబుతుందన్న అంశాన్ని పరిశీలిస్తే, 
 
పౌరసత్వ చట్టం 1955 డిసెంబరు 30 నుండి అమలులోకి వచ్చింది.

1. ఎవరికి పౌరసత్వం లభిస్తుంది?
(అ) 26-1-1950 తర్వాత నుండి 1-7-1987 లోపు ఈ దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తీ ఈ దేశ పౌరసత్వానికి అర్హుడు.
 
(ఆ) 2003లో పౌరసత్వ చట్ట సవరణ జరిగింది. దాని ప్రకారం 1-7-1987 నుండి 2003 సవరణ జరిగిన నాటి మధ్య కాలంలో భారతదేశంలో పుట్టిన వ్యక్తి తల్లిదండ్రులలో ఒకరైనా ఆ నాటికి భారతీయ పౌరులై ఉంటేనే ఆ పుట్టిన వ్యక్తికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది.
 
(ఇ) 2003 సవరణ తర్వాత ఈ దేశంలో జన్మించిన వ్యక్తి తల్లిదండ్రులిద్దరూ ఈ దేశ పౌరులైతేనే ఆ వ్యక్తికి పౌరసత్వం లభిస్తుంది. తల్లిదండ్రులిద్దరిలో ఒకరు ఈ దేశ పౌరులుగా ఉండి రెండోవారు పౌరులుగాకున్నా ఈ దేశంలోకి చట్ట సమ్మతంగా వచ్చి వుంటే అటువంటి తల్లిదండ్రులకు ఈ దేశంలో జన్మించిన వ్యక్తికి కూడా పౌరసత్వం లభిస్తుంది.
 
(ఈ) 26-1-1950 తర్వాత, 1992 డిసెంబరు 10వ తేదీకి ముందు ఇతర దేశాలలో జన్మించిన వ్యక్తికి తండ్రి గనుక భారతీయ పౌరుడైతే ఆ వ్యక్తికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
 
(ఉ) 10-12-1992 తర్వాత ఇతర దేశాలలో జన్మించిన వ్యక్తి తల్లిదండ్రులలో ఏ ఒక్కరు భారతీయ పౌరులైనా ఆ వ్యక్తికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. (అయితే ఆ తల్లిదండ్రులు కూడా విదేశాలలో జన్మించిన వారైతే విదేశాలలో జన్మించిన వారి బిడ్డలకు భారతీయ పౌరసత్వం రాదు). 
 
2. పైన ప్రస్తావించిన పౌరసత్వ నిబంధనల ప్రకారం భారతీయ పౌరులు కాని వారు ఈ దేశంలో పౌరులుగా నమోదు కావాలని కోరుకుంటే వారికి దిగువ పేర్కొన్న అర్హతలలో ఏదైనా ఒకటి ఉండాలి.
 
(ఎ) భారతదేశ మూలాలు కలిగి వుండి, కనీసం ఏడేళ్లు భారతదేశంలో ఉండి వుంటే ఆ తర్వాత మన దేశ పౌరస్వతం పొందవచ్చు.
 
(బి) భారతీయ మూలాలు కలిగి వుండి, స్వతంత్రం రాక మునుపు ఉన్న అవిభక్త భారతదేశంలో గాక వేరే ఏ దేశంలోనైనా పౌరుడిగా ఉన్న వ్యక్తి కూడా మన దేశ పౌరసత్వం పొందవచ్చు.
 
(సి) భారతదేశం లోని పౌరుని వివాహం చేసుకుని ఏడు సంవత్సరాలు ఈ దేశంలో నివాసం ఉంటే పౌరసత్వం పొందవచ్చు.
 
(డి) భారతీయ పౌరుల పిల్లలు దేశ పౌరసత్వం పొందవచ్చు.
 
(ఇ) తల్లిదండ్రులిద్దరిలో ఏ ఒక్కరైనా భారతీయ పౌరులై వుంటే యుక్త వయస్కులైన వారి సంతతి భారతదేశంలో ఒక సంవత్సరం నివసించాక పౌరసత్వం పొందవచ్చు.
ఎఫ్‌. విదేశాలలో ఉండే భారతీయులు (ఓవర్‌సీస్‌ సిటిజన్లు) ఆ విదేశీ పౌరసత్వం నివాసం వుంటే మనదేశ పౌరసత్వం పొందవచ్చు.
 
3. ఇవి గాక ఎవరైనా వ్యక్తి శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సాహిత్య, తాత్విక రంగాలలో మానవాళి పురోగతికి తోడ్పడిన వారు, ప్రపంచ శాంతి కోసం విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వవచ్చు.
 
ఈ నిబంధనలను పరిశీలిస్తే జాతి, కులం, మత విశ్వాసం వీటి ప్రాతిపదికన మన దేశ పౌరసత్వం లేదని స్పష్టం అవుతుంది. కొత్తగా ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాలన్నా, అప్పుడు కూడా జాతి, కుల, మత, విశ్వాసాలతో నిమిత్తం లేదు. సదరు వ్యక్తి ఈ దేశంలో మూలాలు కలిసి వుండడమో లేక ఈ దేశంలో నిర్ణీత కాలం నివాసం ఉండడమో మాత్రమే ప్రాతిపదికగా ఉంది.
 
ఇప్పుడు బిజెపి ఆ ప్రాతిపదికనే మొత్తంగా మార్చివేసింది. పౌరసత్వం ఇవ్వాలా, వద్దా అనేదానికి సంబంధం లేని మతాన్ని ప్రాతిపదికగా తెచ్చింది. ఇది రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చివేసే ప్రయత్నమే.
 
4. జాతీయ పౌరసత్వ గుర్తింపు కార్డులు
 
దీనికి సంబంధించి 2014లో అప్పటి యుపిఎ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. భారతీయ పౌరులందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డు (నేషనల్‌ ఐడింటిటీ కార్డు) తప్పనిసరిగా జారీ చేయాలని, అందుకోసం 'జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌'ను నిర్వహించాలని ఆ సవరణ నిర్దేశించింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. 
 
ఈ నిబంధనను దేశం మొత్తానికి వర్తింపజేయడం సరికాదని, వివాదం ఉన్న అస్సాం ప్రాంతం వరకే పౌరసత్వ రిజిస్టరు తయారీ ప్రక్రియను పరిమితం చేయాలని ఆదేశించింది.
 
సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఈ ఆదేశానికి విరుద్ధంగా జాతీయ పౌరసత్వ రిజిస్టరును దేశం మొత్తానికి వర్తింపజేసే విధంగా బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. 2021 జనాభా లెక్కల సేకరణతో దీనిని అనుసంధానం చేయనుంది.
ఇప్పుడు ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్నైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు మనమే రుజువు చేసుకోవాలి. 
 
ఈ దేశంలోనే పుట్టినట్లు దాఖలా ఏంటి? 
 
పుట్టిన స్థలానికి ఎక్కువ మంది దగ్గర రుజువు ఉండదు. స్కూలు సర్టిఫికెట్‌లో 10వ తరగతి బోర్డు సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ ఉంటుంది తప్ప ఏ ఊళ్లో పుట్టిందీ ఉండదు. మునిసిపల్‌, పంచాయితీ రికార్డుల్లో జనన, మరణ రిజిస్టర్లు ఉంటాయి. వాటిలో నమోదు అయి వుండాలి. లేదా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం జరిగినట్లు ధృవప్రతాలు వుండాలి. ఎవరి దగ్గర ఉంటాయి? ఇప్పుడు కావాలంటే ఎవరిస్తారు? అధికారులు ఎవరిని ప్రశ్నించవచ్చు? ఈ ప్రశ్నలు అందరిలోనూ భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. 
 
ఈ భయాందోళనలు ముస్లిం మైనారిటీలలో మరీ ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజల వద్ద రికార్డులు ఏముంటాయి? పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు కోసం వలసలు పోయిన కార్మికుల వద్ద ఏ రికార్డులుంటాయి? 
 
ఇన్నేళ్లూ ఈ దేశ పౌరులు కాని వారెవరో గుర్తించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది. ఇప్పటి నుంచీ మనం ఈ దేశ పౌరులమని రుజువు చేసుకోవాల్సిన అగత్యం కల్పించింది మోడీ ప్రభుత్వం. 
 
ఇది సరైనదేనా?
ఎవరినైనా చట్టం ముందు ముద్దాయిగా నిలబెడితే, అతగాడు నేరస్తుడు అని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగాకుండా, ఎవరినైనా తెచ్చి ముద్దాయిగా నిలబెట్టి ఫలానా నేరం నువ్వు చేయలేదని నిరూపించుకో అంటే అర్థం ఏంటి? న్యాయం తలకిందులవడమే కదా? ఇంత తీవ్రమైన దాడి జరుగుతున్నప్పుడు కూడా ప్రేక్షకుల్లాగా ఉండిపోదామా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరితహారం చెట్లు నరికినందుకు రూ.45వేలు ఫైన్