చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో భూమి నుంచి వస్తున్న వింత శబ్దాలు మళ్లీ భయపెట్టాయి. అంతా గాఢ నిద్రలో వున్న సమయంలో భూమి బద్ధలవుతున్నట్లు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భీతిల్లిపోయారు. దిక్కూదెస తెలియకుండా ఎటుబడితే అటు పరుగులు తీసారు.
ఇదంతా రామకుప్పం మండలం పరిధిలోని చిన్నగరిగేపల్లి, గడ్డూరు, ఎస్.గొల్లపల్లి, గొరివిమాకుల పల్లిలో చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో తరచూ భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వారు చెపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నట్లు చెపుతున్నారు.
దీనంతటికీ కారణం తమ మండలానికి సమీపంలో పెద్దఎత్తున మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడమేనని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణల నేపధ్యంలో అధికారులు రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు.