పెళ్లైన ఆరు నెలలకే బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యారాయ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పట్నా కోర్టులో శుక్రవారం ఆయన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం దరఖాస్తు చేయడం ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఐశ్వర్య తల్లిదండ్రులు ఈ విషయం గురించి చర్చేందుకు లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటికి వెళ్లడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు నచ్చచెప్పినప్పటికీ.. తేజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబసభ్యులు ఎవరూ స్పందించడానికి ఇష్టపడలేదు.
కాగా.. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ యాదవ్ లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. తేజ్, ఐశ్వర్యల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగానే వారు విడిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. వారు వారి బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదని చెప్పారు.
దీంతో.. హిందూ చట్ట ప్రకారం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కాగా ఈ ఏడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్‌ల వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీ ఎత్తున అతిథులు హాజరైన సంగతి తెలిసిందే.