భారత్‌కు ఏం అవసరం వచ్చిందని రాఫెల్ జెట్ ఫైటర్లు కావాల్సి వచ్చిందని పాకిస్థాన్ తనలోని అక్కసును వెళ్లగక్కింది. పైగా, భారత్ తన రక్షణ అవసరాలకు మించి ఆయుధాలను సమకూర్చుకుంటోందంటూ గగ్గోలు పెడుతోంది.
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా 36 రాఫెల్ జెట్ ఫైటర్ విమానాలను రూ.59 వేల కోట్ల వ్యయంతో భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా, తొలి దశలో ఐదు రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్‌కు పంపించింది. ఇవి బుధవారం మధ్యాహ్నం భారత గడ్డను ముద్దాడాయి. ఈ జెట్ ఫైటర్లకు ఇండియన్ ఆర్మీ జల ఫిరంగులతో స్వాగతం పలికారు.
హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానికదళ కేంద్రంలో ల్యాండ్ అయిన రాఫెల్ జెట్లను చూసిన పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. భద్రతా అవసరాలకు మించి సైనిక సామర్ధ్యాలను భారత్ కూడగట్టుకుంటోందని పాకిస్థాన్ తన కుళ్లుబోతుతనాన్ని మరోసారి ప్రదర్శించింది.
రాఫెల్ విమానాలు ఇప్పుడు భారత్‌కు ఏం అవసరం, వారు భద్రతకు కావాల్సిన సైనిక సామర్ధ్యాలను మించి కూడగట్టుకుంటున్నారని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. దక్షిణ ఆసియాలో ఆయుధ పోటీకి దారితీసే భారతదేశాన్ని అసమానమైన ఆయుధాల సేకరణ నుంచి నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్ కోరింది.