Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పిపోయిన పిల్లి కోసం రేణిగుంటలో వెతుకుతున్న దంపతులు... 22 రోజులుగా అక్కడే...

Advertiesment
తప్పిపోయిన పిల్లి కోసం రేణిగుంటలో వెతుకుతున్న దంపతులు... 22 రోజులుగా అక్కడే...
, శుక్రవారం, 5 జులై 2019 (18:22 IST)
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ తప్పిపోవడంతో రేణిగుంట రైల్వే స్టేషన్లో 22 రోజులుగా వెదుకుతూ పడిగాపులు పడుతోంది ఈ సూరత్ జంట. అయితే తమ బిడ్డ ఎక్కడైనా కనపడిందా అంటూ వారు చూపిన ఫొటోను చూసిన వారు మాత్రం అవాక్కవుతున్నారు. కారణం వారి బిడ్డ పిల్లిపిల్ల కావడమే. ఇంతకూ పిల్లితో వీరికి అనుబంధం ఏమిటి.. పెంపుడు జంతువు కోసం ఈ దంపతులు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు.?
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన బట్టల వ్యాపారి జెఇష్ భాయ్ అయన భార్య మీనాకు వివాహమై 17 సంవత్సరాలు గడుస్తున్నా  పిల్లలు లేరు. దీంతో గత సంవత్సరం ఒక పిల్లిని తెచ్చుకొని దానికి బాబు అని పేరుపెట్టి ముద్దుగా చూసుకుంటూ తమకు పిల్లలు లేరనే విషయాన్నీ మరచిపోయి సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. 
 
ఈలోగా ఒకసారి తిరుమల దర్శనం చేసుకొని తమ మొక్కులు తీర్చుకోవాలని తమ బిడ్డ పిల్లి బాబుతో కలసి గత నెల 9వ తారీఖున తిరుమల చేరుకొని రెండు రోజులు అక్కడే బసచేసి తిరిగి 13 వ తారీఖున సూరత్ బయలుదేరేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకొన్నారు. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తమ పిల్లిని ఎత్తుకొని వెళ్లడంతో, రైల్వేస్టేషన్ మొత్తం వెతకటం  ప్రారంభించారు. కానీ ఎంత ప్రయత్నించినా పిల్లి దొరకక పోవడంతో ఎవరైనా సహాయం చేసి తమ బిడ్డ పిల్లిని వెతికి పెట్టాలని కనిపించిన ప్రతి ఒక్కరిని వేడుకున్నారు. పిల్లి కోసం వారు పడుతున్న బాధను చూసి కొందరు జాలిపడ్డారు. 
 
మరికొందరు ఆకతాయిలు ఇదే అదనుగా వారితో మీ పిల్లిని వెతికిపెడతాం అని చెప్పి సుమారు యాభై వేల రూపాయలను దండుకొని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానిక టాక్సీ డ్రైవర్లు వారికి తోడుగా వచ్చి రైల్వే పోలీసులకి విషయం తెలిపారు. అయితే రైల్వే పోలీసులకు పిల్లి కోసం ఏం కేసు పెట్టాలో అర్థంగాక కంప్లైంట్ తీసుకోకుండా సొంతూరు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆ దంపతులిద్దరూ ఇరవై రెండురోజులుగా రాష్ట్రంకాని రాష్ట్రంలో భాష రాని చోట దిక్కుతోచని స్థితిలో పిల్లి కోసం వెదుకుతున్నారు. 
 
పిల్లితో సహా తీయించుకున్న ఫోటోను చేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో రేణిగుంటలో ప్రతి వీధి తిరుగుతూ తమ బిడ్డ పిల్లి బాబు కనబడిందా అంటూ అందరిని ప్రాధేయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతకు గుడ్ న్యూస్.. మొబైళ్ల ధరలు తగ్గుతున్నాయోచ్..