ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని మాత్రమే పార్టీ తరపున అభ్యర్థిగా ప్రకటించాననీ, దీనిపై రచ్చరచ్చ చేసి పార్టీని చంపేయకండి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఆయన మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'జిల్లాలో ఒకే ఒక అభ్యర్థిని ఖరారు చేశాను. ముమ్మిడివరం అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును మాత్రమే ప్రకటించాను. అది నా ఒక్కడి నిర్ణయం కాదు. జిల్లాలో ఇక ఎవ్వరికీ సీట్లు ఇవ్వలేదు. అనవసరపు పనులతో పార్టీని చంపేయకండి' అని ఆయన వ్యాఖ్యానించారు.
'మనకు కావలసింది అధికారం కాదు.. మార్పు. అది రావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో కూడిన యంత్రాంగం కావాలి. ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థని ఊరట కలిగించడానికే నా వంతుగా పార్టీ పెట్టా. పార్టీ పెట్టినప్పుడు ఐదుగురు కూడా లేరు. కానీ నాకు నమ్మకం. నేను వస్తే నా వెంట అందరూ వస్తారని నమ్మకం. అది నిజమైంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
'నాకు భగవంతుని ఆశీస్సులున్నాయి. కవాతుకు లక్షలాదిగా జనం వస్తుంటే చూసి ఖిన్నుడనైపోయాను. తూర్పుగోదావరి జిల్లాకు జనసేన ద్వారా చేయాల్సింది చేద్దాం. శ్రీకాకుళంలో తుపాను బాధితులను పరామర్శించి వచ్చిన తర్వాత ఇక్కడ పర్యటన ప్రారంభిస్తా' అని వ్యాఖ్యానించారు.