Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోకేష్‌కు అక్క అయితే ఇలాగే సర్దుబాటు చేస్తారా?: పవన్ ప్రశ్న

లోకేష్‌కు అక్క అయితే ఇలాగే సర్దుబాటు చేస్తారా?: పవన్ ప్రశ్న
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:35 IST)
జనసేన కవాతులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన జగన్-చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి మాట్లాడుతూ... ''జగన్ మోహన్ రెడ్డి మీద నాకు కోపం లేదు. ఆయన లక్ష కోట్లు తిన్నాడో లేదో భగవంతుడికెరుక. కానీ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడే.. ఆయన అనుచరుడు ఒకరు.. నా దగ్గరకొచ్చి ఆయన పేరు చెప్పి... నేను తనకు ఒక సినిమా చేయాలని దబాయింపుగా అడిగారు. నాలాంటి వాడికే ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడికే.. నాకోసం ప్రాణాలిచ్చే ఇన్నికోట్ల మందిని కలిగి ఉన్న వాడినే ఇలా బెదిరించగలిగితే.. సగటు ప్రజలకు మీతో ఎన్ని ఇబ్బందులుంటాయో అనే అనుమానం వచ్చింది. మీ వద్ద ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటే వాటిని గోదావరిలో కలిపేస్తా జాగ్రత్త. 
 
మేం ప్రజాస్వామ్య బద్ధంగా బతుకుతాం.. వేటకొడవళ్లతో గండ్రగొడ్డళ్లతో బెదిరిస్తే భయపడం. మాకూ పౌరుషాలుంటాయ్.. ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రికి కావొచ్చు. ప్రతిపక్షనేతకు కావొచ్చు... ఇదే చెబుతున్నా.. మనం ప్రజాస్వామ్య యుద్ధం చేద్దాం. మీరు అలాకాకుండా వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఫ్యాక్షన్ రాజకీయాలతో ఇబ్బందులు పెడితే.. జనసేన ప్రజాస్వామ్య ఉద్యమాలతో నలిపేస్తాం.. మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం.. అన్నింటికీ తెగించి వచ్చాం. ఏ బెదిరింపుకూ లొంగేవాణ్ని కాదు. 
 
నేను ముఖ్యమంత్రి గారిని అప్పట్లో ఒక్కటే అడిగా. శాంతిభద్రతలు బాగుండాలని కోరా. కానీ ఆయన పాలనలో రౌడీరాజ్యం తయారైంది. దెందులూరు ఎమ్మెల్యే.. ఒక మాదిగ యువకుడిని తూలనాడితే సీఎం జోక్యం చేసుకోరు. దళిత తేజం కార్యక్రాలు నిర్వహిస్తారు. ఇంకెక్కడ అంబేద్కర్ స్ఫూర్తి? ఒక మహిళ తహసీల్దార్‌ను జుట్టపట్టి బయటకీడ్చి చెంపదెబ్బ కొడితే పట్టించుకోడు. కాళ్లిరగ్గొట్టి కూర్చోబెట్టరు. ఏం తప్పుడు సంకేతాలు పంపుతున్నారు మీరు. మీ అనుభవం ఎందుకు? వనజాక్షి గారు మీ ఇంట్లో మహిళ అయితే, లోకేష్‌కు అక్క అయితే ఇలాగే పెద్దల్తో సర్దుబాటు చేస్తారా? ఏం సంకేతాలు ఇస్తున్నారు. ఇవన్నీ మేం భరించాలా? 2019 చాలా కీలకం. మీరు పద్దతులు మార్చుకోండి. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయొద్దు. 
 
కేజ్రీవాల్ మీద చేసినట్టు మీ మీద ఐటీ దాడులు చేస్తే.. ఖచ్చితంగా తెదేపా ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ, ఎక్కడో అండమాన్‌లో గుంటూరులో ఐటీ రెయిడ్ అయినా.. వ్యాపారుల మీద రెయిడ్ అయితే.. క్లీన్‌గా బయటకు రండి. తెదేపా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడితే.. రాష్ట్రంపై ఐటీదాడులు జరిగితే అండగా ఉంటాం. సీఎం స్కాములు దోపిడీలు అన్నీ చేసి కంతలో దాగితే పిడుగు తప్పదు. సీఎం మీరు క్లీన్‌గా రావాల్సిన అవసరం ఉంది. 
 
ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం లేదంటారు. చేలో లేని పంట చేతికెలా వస్తుందని సామెత. మీకు అనుభవం ఉందని అధికారం యిస్తే మీరు ఎందుకు అడగలేకపోయారు? కావాలంటే నన్ను ఢిల్లీ తీసుకెళ్లి ఉండొచ్చు.. నన్ను ఎన్నడూ తీసుకెళ్లలేదు. మరి పిలవని పేరంటానికెందుకు వెళ్తాం. ఆత్మగౌరవంతో బతికేవాణ్ణి. రాష్ట్ర శ్రేయస్సు కోసం అధికారాన్ని మీకిచ్చిన వాణ్ని. ఆయన నన్ను ఎందుకు పిలవలేదంటే.. జనసేన బలపడిపోతుందని భయం. లక్షల మంది ప్రజల ముందు చెబుతున్నా.. మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి. సీపీఐ- సీపీఎం- జనసేన ప్రధాన ప్రతిపక్షం అందరినీ పిలవండి వస్తాం.. కలిసి పోరాడుదాం.. ఢిల్లీని నిలదీద్దాం.. నాకేం భయంలేదు. నాకు వ్యక్తిగత భయాల్లేవు. ఢిల్లీ వీధుల్లో పోరాడదాం.. ఇవాళే అయినా సై... రా బయటకు... తేల్చుకుందాం.. ఢిల్లీ వెళ్లి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పని రాక్షసుడు' నారా లోకేష్‌ను పట్టుకుని అంత మాట అంటారా?