సినీ క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల గురించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ పైన పెద్ద ఎత్తున కామెంట్లు చేయడమే కాదు వ్యక్తిగత విమర్సలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయడం లేదంటూ విమర్సలు చేశారు.
అది కాస్త అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ పైన విరుచుకుపడ్డారు. పవన్‌ను మరోసారి విమర్సిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అంతటితో ఆగని కత్తి మహేష్ జనసేన పార్టీ పైనా విమర్సలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ పైనా విమర్సలే కాకుండా పలు విషయాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చివరకు రాష్ట్ర బహిష్కరణకు కొన్నిరోజుల పాటు గురయ్యాడు. ఆ తరువాత కాస్త తగ్గారు కత్తి మహేష్. అయితే గత నెల 26వ తేదీన విజయవాడ నుంచి పీలేరుకు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు.
కత్తి మహేష్‌ను చెన్నై ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే మహేష్ పార్థీవదేహాన్ని సందర్సించేందుకు సినీప్రముఖులు ఎవరూ రాకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధికసంఖ్యలో చిత్తూరు జిల్లా యలమందకు వచ్చారు.
యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కత్తి మహేష్ పాడె మోశారు. దగ్గరుండి దహనక్రియలు పూర్తయ్యేంతవరకు సహాయపడ్డారు. మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ అతను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరుండి కత్తి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొనడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.