రెండు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని.. సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇద్దరు సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నామని ప్రకటించారు.. మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందన్నారు.
కులాలను పైకి తీసుకురావడం అంటే కార్పొరేషన్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు. అధికారం లేని కులాలకు అధికారం తెచ్చే విధంగా జనసేన పని చేస్తుందని.. సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ఒక్కడి గెలుపు కోసం అయితే ఏదో ఒక పార్టీలో చేరేవాన్ని.. ప్రజల కోసం పార్టీ పెట్టానని తెలిపారు.
సీఎం ఇంటికి దగ్గరలో మానభంగం జరిగితే.. దిశా యాప్ పెట్టే రాజకీయాలు మనకి వద్దని చెప్పారు. అలాంటి తప్పులు జరుగకుండా ఉండేలా రాజకీయాలు ఉండాలని కోరారు. ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలని చెప్పి.. 3 వేల ఉద్యోగాలు ప్రకటించారని విమర్శించారు. భూతులు తిట్టే నేతలు ఉంటే సమాజం ఎటు పోతుందని ప్రశ్నించారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు.. అభివృద్ధి చేసి పథకాలు ఇవ్వాలన్నారు.
కరోనా కారణంగా బాధ్యతతో కొంత కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. జనసైనికులు లేనిదే జనసేన పార్టీ లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆవేదనే జనసేన పార్టీ పెట్టేలా చేసిందన్నారు.
అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదు.. మార్పు కోసం తహతహలాడే వ్యక్తినని పేర్కొన్నారు. నిస్వార్థ రాజకీయాలు చెయ్యాలంటే జనసేనే అసలైన ఫ్లాట్ ఫామ్ అని అన్నారు. రాజకీయాలు చెయ్యడం అంటే భూతులు తిట్టడం కాదు.. మార్పు తీసుకురావాలని చెప్పారు.