వైఎస్ కుమార్తె వైఎస్. షర్మిల కొత్త పార్టీ ఆవిర్భావంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని తన తండ్రి వైఎస్ఆర్ జయంతి రోజైన జూలై 8న ప్రకటించనున్నారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని అన్నారు.
కొత్త పార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతోందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. జనసేన ఇపుడు కొత్తగా వచ్చిందికాదన్నారు. 2007 నుంచి తాను రాజకీయంలో ఉన్నానన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వారిని జనసేన గుర్తించి.. ప్రోత్సాహం ఇస్తుందన్నారు.
పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనదని పవన్ కల్యాణ్ అన్నారు. తను పగటి కలలు కనే వ్యక్తిని కాదన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాలన్నదే తమ అభిమతమని జనసేనాన్ని చెప్పుకొచ్చారు.