మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో వున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, ఎమ్మెల్సీ సీటుపై కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు.
ఆయన నటించిన 151 చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబరు 2న గాంధీజి జయంతి నాడు విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో చిరంజీవి చిత్ర ప్రమోషన్లో భాగంగా పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమిళ పత్రికలకు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. అదే రజీనీకాంత్, కమల్ హాసన్ లో రాజకీయ ప్రవేశం గురించి. దీనిపై ఆయన చాలా స్పష్టంగా సూచన చేశారు.
రాజకీయాల్లోకి సున్నితమైన మనస్తత్వం కలిగినవారు విఫలమవుతారని రజనీకాంత్, కమల్ హాసన్‌లకు సూచించారు. మారిన రాజకీయ పరిస్థితులు దృష్ట్యా వారు రాజకీయాలకు దూరంగా వుంటే మంచిదని నా అభిప్రాయం. నేను "మంచి చేయాలనే" ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వెళ్లాను. ఆ సమయంలో సినిమాల్లో నేను "నంబర్ వన్".
"ఈ రోజు రాజకీయాలు డబ్బుతో ముడిపడిపోయాయి. కోట్ల రూపాయలను ఉపయోగించి నా స్వంత నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. ఇటీవలి ఎన్నికలలో నా సోదరుడు పవన్ కళ్యాణ్‌కు కూడా అదే జరిగింది" అని చిరంజీవి అన్నారు.
రాజకీయాల్లోనే వుండాలంటే ఓటమి, నిరాశ, అవమానాలను ఎదుర్కోవాలి. రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఇద్దరూ సున్నితమైన మనస్తత్వం కలవారని భావిస్తున్నట్లు చెప్పారు. ఐనప్పటికీ వీరు రాజకీయాల్లో కొనసాగాలంటే, ప్రజల కోసం పనిచేయాలని నిశ్చయించుకుంటే అన్ని సవాళ్లను, నిరాశలను ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కమల్ హసన్ బాగా రాణిస్తారని తాను ఆశించానని, అయితే దురదృష్టవశాత్తు అది జరగలేదని చిరంజీవి అన్నారు. కమల్ హాసన్ స్వయంగా పోటీ చేయలేదు. ఆయన పార్టీ ఏ సీటును గెలుచుకోలేదు. రజనీకాంత్ ఇంకా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయలేదు లేదా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఐతే త్వరలో రాజకీయ పార్టీ స్థాపించాలని రజినీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.