Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే... బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట.. ఇలాగే చంద్రబాబు అరచేతి కథ

ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే... బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట.. ఇలాగే చంద్రబాబు అరచేతి కథ
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:54 IST)
ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే  బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడు అన్నది ఓ సామెత. అచ్చం ఇలానే ఉంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరచేయి నొప్పి కథ. చంద్రబాబు కుడి చేయి ఇపుడు వార్తలకెక్కింది. చేతి నొప్పి కారణంగా పూర్తి విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబు వెళ్లారు. కానీ, వైకాపా నేతలు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. వరద నీటికి భయపడి అమరావతి నుంచి హైదరాబాద్‌కు పారిపోయాడంటూ ఆరోపిస్తున్నారు. దీంతో చంద్రబాబు అరచేయి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ అరచేయి వెనుక కథ ఏంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
చంద్రబాబు కుడి అరచేయి బాగా వాసిపోయింది. అది సాధారణ స్థితికి రావాలంటే కనీసం పది రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే, ఆయన మాత్రం పట్టించుకోకుండా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి అరచేతికి కట్టు కట్టుకుని వచ్చారు. ఆ కట్టు చూసి పార్టీ నేతలు ఆరాతీశారు. అప్పటికే చంద్రబాబు చేతికి వాపు ఎక్కువగా ఉండటంతో ఆ చేయి కదల్చవద్దని వైద్యులు స్పష్టంచేశారు. ప్రసంగం సమయంలో, ఆ తర్వాత నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన చేతిని కదల్చడంతో ఆ సాయంత్రానికి వాపు ఎక్కువైంది.
 
టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగే ఫంక్షన్ హాల్‌కు వైద్యులు వచ్చి చంద్రబాబు చేతిని పరిశీలించారు. కనీసం వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలనీ, లేనిపక్షంలో చేతివాపు తగ్గదనీ సూచించారు. ఎక్స్ రేలు తీసి పరిశీలించారు. ఇవే ఎక్స్ రేలను హైదరాబాద్ పంపటంతో అక్కడి వైద్యనిపుణులు పరిశీలించారు. అనంతరం చెయ్యి కదల్చకుండా వారంరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆయన అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సుమారు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం అమరావతికి వచ్చారు. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు.
 
కానీ, వైకాపా నేతలు మాత్రం మరోలా ప్రచారం చేస్తున్నారు. వరదలకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారంటూ ఆరోపిస్తున్నారు. నిజానికి చంద్రబాబు చేతి వాపు వెనుక పెద్ద కథే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున చంద్రబాబును కలిసేందుకు తరలివచ్చారు. వారిందరితో కరచాలనం చేస్తూ, ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ రోజంతా బిజీగా గడిపారు. ఇలా పలువురు గట్టిగా కరచాలనం చేయడంతో చంద్రబాబు కుడి అరచెయ్యి నరాలు తీవ్ర ఒత్తిడి గురయ్యారు. దీంతో వాపు వచ్చింది. 
 
దీన్ని పరిశీలించిన వైద్యులు... రెండు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. కానీ ఆ తర్వాతి రోజే పార్టీ సమావేశాలు ఉండటం, సర్వసభ్య సమావేశం కూడా జరగడంతో చంద్రబాబు చేతికి విశ్రాంతి ఇవ్వలేదు. ఫలితంగా చెయ్యికి వాపుతోపాటు నొప్పి కూడా అధికమైంది. దీంతో ఆయన విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే వరద భయంతోనే చంద్రబాబు పారిపోయారంటూ వైసీపీ నేతలు వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలేమో.. చంద్రబాబు చెయ్యినొప్పి కారణంగానే హైదరాబాద్ వెళ్లారని తమ వాయిస్‌ వినిపిస్తున్నారు. ఇలా ఎవరి వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబు చెయ్యినొప్పి వెనుక అసలు కథ ఇది అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాలకు గుండె పరీక్షలు... ఎక్కడ? ఆ ఆస్పత్రిలో వింత చికిత్సలు