శవాలకు గుండె వైద్య పరీక్షలు.. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు శవాలకు కూడా గుండె పరీక్షలు చేస్తున్నారు. ఈ వింతను చూసిన ఇతర రోగులు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణంగా ఎవరైనా తీవ్ర అస్వస్థతకు గురై చావుబతుకుల మధ్య ఆస్పత్రికి వచ్చినపుడు గుండె పనితీరును పరీక్షించే వైద్య పరీక్షల వైద్యులు చేస్తుంటారు. గుండె పల్స్‌ను బట్టి అతడి ఆరోగ్య పరిస్థితిని సంబంధిత వైద్యులు గుర్తిస్తారు. ఆ మేరకు తగిన వైద్యచికిత్సలందించడానికి ప్రయత్నిస్తారు.
కానీ, అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజనాస్పత్రిలో ఇందుకు విరుద్ధంగా వైద్యులు వ్యవహరిస్తున్నారు. వివిధ వ్యాధులు, ప్రమాదాలతో ఈ ఆస్పత్రికి నిత్యం అనేకమంది వస్తుంటారు. దీంతో ఈసీజీ తీసేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎమర్జెన్సీ వార్డులో జరిగే పరీక్షలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అత్యంత సీరియస్ కేసులకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తూంటారు. అలాంటి వారిలో ఎక్కువమంది చనిపోతుంటారు. సగటున ప్రతిరోజూ పదిమంది వరకు ఆ వార్డులో చేరినవారు మరణిస్తుంటారు. కొందరైతే ఇక్కడికి తీసుకువచ్చేలోపే ప్రాణాలు వదులుతుంటారు.
అలాంటి కేసులను ఆ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యులు పరిశీలించాలి. డెత్‌పల్స్ ద్వారా వారు ప్రాణంతో ఉన్నదీ.. లేనిదీ వైద్యులు నిర్ధారించవచ్చు. అయితే చనిపోయారని తెలిసినా అక్కడి వైద్యులు మాత్రం ఈసీజీ తీయిస్తున్నారు. ఫ్లాట్‌లైన్ వస్తే చనిపోయినట్లు చెప్పి పంపిస్తున్నారు. కొందరు వైద్యులయితే చనిపోయినట్లు నిర్ధారించి రికార్డుల్లో నమోదు చేసిన తర్వాత కూడా ఈసీజీ తీయిస్తున్నారు. బయటి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారు ఇక్కడికి వచ్చినా.. ఆ శవాలకు కూడా ఈసీజీ తీయిస్తున్నారు.
ఆ విభాగంలో రెగ్యులర్ టెక్నీషియన్లు లేరు. దీంతో కొన్నేళ్లుగా కాంట్రాక్టు సిబ్బందే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం అర్హత ఉన్న ఒక ఔట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌తో పాటు ఒక ప్లంబర్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక ఎలక్ట్రీషియన్ ఆ విభాగంలో పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో మొత్తం 21 విభాగాలున్నాయి. ఆయా విభాగాలకు ఈ సిబ్బందే వెళ్లి ఈసీజీ తీయాల్సి ఉంటుంది.
పైగా, ఎమర్జెన్సీ వార్డులో చనిపోయిన శవాలకు కూడా గుండె పరీక్షలు చేయిస్తూ వారితో వైద్యులు ఆడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా వారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ సిబ్బంది తీరు చూసి మృతి చెందిన రోగుల బంధువులు కూడా చనిపోయినవారికి గుండె పరీక్షలు ఏంటబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.