Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటక రాజకీయం: అడ్వాణీకి వర్తించిన రిటైర్మెంట్ రూల్ యడ్యూరప్పకు వర్తించదా?

Advertiesment
కర్ణాటక రాజకీయం: అడ్వాణీకి వర్తించిన రిటైర్మెంట్ రూల్ యడ్యూరప్పకు వర్తించదా?
, బుధవారం, 24 జులై 2019 (18:18 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని నాలుగోసారి చేపట్టేందుకు బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ వల్ల కానిది కూడా ఆయన సాధ్యం చేసుకున్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ-బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కమలం పార్టీలో అత్యంత శక్తిమంతమైన ద్వయం. అయితే, ఈ ద్వయం తీసుకొచ్చిన నిబంధన తనకు వర్తించకుండా యడ్యూరప్ప చేసుకోగలిగారు.

 
75 ఏళ్ల వయసు దాటారన్న కారణం చూపించి అడ్వాణీకి మోదీ-షా ద్వయం విశ్రాంతినిచ్చింది. కానీ, ఇప్పుడు 76 ఏళ్ల యడ్యూరప్పను మాత్రం పక్కన పెట్టలేకపోయింది. విశ్వాస పరీక్షలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని ఓడించడంలో అందించిన 'సహకారాని'కి ధన్యవాదాలు తెలుపుతూ మోదీ, షాలకు యడ్యూరప్ప లేఖలు కూడా రాశారు. ప్రస్తుత పరిస్థితి, పరిణామాలు తన వల్లే సాధ్యమయ్యాయని ఈ లేఖల ద్వారా యడ్యూరప్ప అంతర్లీనంగా సందేశం ఇచ్చారు.

 
లింగాయత్‌ల అండ..
కర్ణాటకలో బీజేపీకి చేతులు కట్టేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన సిద్ధరామయ్య కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ ఉన్న నాయకుడు యడ్యూరప్ప ఒకరే. సొంత వర్గం లింగాయత్‌లు ఆయనకు అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఇది చాలా బలమైన సామాజిక వర్గం. వొక్కళిగలు కూడా ఇలాంటి బలమైన వర్గమే అయినప్పటికీ, వాళ్లు దక్షిణ కర్ణాటకకు మాత్రమే పరిమితం. 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ ఇక్కడ దేవె గౌడ కుటుంబం హవా సాగింది. లింగాయత్‌లు మాత్రం రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నారు.
webdunia
 
1989లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వీరేంద్ర పాటిల్ ఒక ఏడాది తర్వాత సీఎం కుర్చీని కోల్పోయారు. లింగాయత్‌లకు దుర్దశ అంటే ఇదే. రాష్ట్రంలో అడ్వాణీ రథయాత్ర తర్వాత దేవనగరిలో చెలరేగిన అల్లర్లను పక్షవాతానికి గురైన వీరేంద్ర పాటిల్ కట్టడి చేయలేకపోయారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ బెంగళూరు విమానాశ్రయంలో పాటిల్‌ను సీఎం పదవి నుంచి తప్పించారు.

 
అప్పటి నుంచి లింగాయత్‌లు జనతా పార్టీ ఓటు బ్యాంకుగా మారారు. కొన్నేళ్ల తర్వాత యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీకి విధేయులుగా మారారు. యడ్యూరప్పను తెర మరుగు చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావించినట్లు గుసగుసలు వినిపించిన మాట వాస్తవం.

 
అంత సౌఖ్యమేమీ కాదు
వీరేంద్ర పాటిల్ తరహా పరిణామం తమకు రాకూడదని కోరుకుంటున్నామని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ బీజేపీ నాయకుడు బీబీసీతో అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ లింగాయత్ వర్గం ఓట్లను పెద్ద మొత్తంలో సాధించలేకపోతుండటం మరవకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్పకు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి మంచి సహకారం ఉందని తాను భావించట్లేదని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి అన్నారు.

 
''2014లో యడ్యూరప్పకు కేంద్ర మంత్రి పదవిని ఇవ్వకపోవడమే స్పష్టమైన సంకేతం. పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే నాయకత్వం కోరుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించి, ఏడాది చివరికల్లా ఎన్నికలు జరపొచ్చు'' అని శాస్త్రి అభిప్రాయపడ్డారు. యడ్యూరప్పకు సీఎం కుర్చీ అంత సౌఖ్యంగా ఏమీ ఉండకపోవచ్చు. ఇప్పుడు పదవి కోల్పోయిన కుమార స్వామి కూడా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అదే చెప్పారు. ''మీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలుస్తుంది మీకు ఈ బాంబు పేలుడు ప్రభావం. తీర్పు కోసం ప్రజల వద్దకు వెళ్లడమే ఉత్తమం'' అని కుమార స్వామి అన్నారు.

 
ఇది రెండోసారి
తన ప్రభుత్వాన్ని కూల్చిన రెబల్ ఎమ్మెల్యేలు, యడ్యూరప్పకు అదే గతి పట్టిస్తారని కుమారస్వామి తనదైన శైలిలో హెచ్చరించారు. కుమారస్వామిని తప్పించి, తాను అధికారంలోకి రావడం యడ్యూరప్పకు ఇది రెండోసారి. 2006లో బీజీపీ-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం యడ్యూరప్పకు అధికారం అప్పగించేందుకు కుమారస్వామి నిరాకరించారు.
webdunia
 
రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఒంటి చేత్తో గెలిపించి యడ్యూరప్ప సీఎం పదవి చేపట్టారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం, తిరిగి ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లపై గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వానికి బలాన్ని కూడగట్టుకున్నారు.

 
‘అప్పటిలా అసమ్మతి లేదు’
ఫిరాయింపు ఎమ్మెల్యేలే నిర్ణయాత్మకంగా ఉండటంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు యడ్యూరప్ప నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే అప్పటిలా ఇప్పుడు పార్టీకి అసమ్మతి సమస్య ఉంటుందని తాను భావించట్లేదని బీజేపీ నేత సురేశ్ కుమార్ అన్నారు. అప్పటి యడ్యూరప్ప ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు.

 
''204 సభ్యులున్న అసెంబ్లీలో మాకు 105 మంది మద్దతు ఉంది. ప్రభుత్వానికి సుస్థిరత సాధించి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటాం. అసంతృప్తితో ఎవరూ లేరు. సమస్యేమీ నాకు కనిపించడం లేదు'' అని సురేశ్ కుమార్ చెప్పారు.

 
కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 20 మంది రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకోవడానికి వ్యతిరేకంగా యడ్యూరప్ప నివాసం ముందు నిరసనలు కూడా జరిగాయి. అయితే, వారి ప్రయోజనాలకు ఇబ్బంది రాకుండా చూస్తామని అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి... హైకోర్టులో యువజన కాంగ్రెస్ పిల్