నిర్భయ దోషులపై కరుణ వద్దు.. ఉరే సరి : సుప్రీంకోర్టు
నిర్భయ లైంగికదాడి కేసులో దోషులుగా తేలినవారిపట్ల దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదనీ, వారికి ఉరేసరైన శిక్ష అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ కేసులో దోషులకు విధించిన మరణశిక్షే సరైనదేనంటూ తీర్పుని
నిర్భయ లైంగికదాడి కేసులో దోషులుగా తేలినవారిపట్ల దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదనీ, వారికి ఉరేసరైన శిక్ష అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ కేసులో దోషులకు విధించిన మరణశిక్షే సరైనదేనంటూ తీర్పునిచ్చింది. పైగా, ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.
నిర్భయ కేసులో తమకు పడిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషన్ నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దోషుల ఈ పిటిషన్‌ను విచారించి ఈ తీర్పును వెలువరించారు.
కాగా, గత 2012 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచారకాండపై ఢిల్లీ హైకోర్టుతోపాటు కింది ట్రయల్ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. క్రూరమైన, అత్యంత హేయమైన, మొరటుతనంతో కూడిన, దౌర్జన్యపూరితమైన నేరంగా అభివర్ణించిన సుప్రీం కోర్టు ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన నేరస్తులకు మరణశిక్షే సరైనందంటూ స్పష్టం చేసింది. ఈ తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.
2012, డిసెంబర్ 16వ తేదీన.. దక్షిణ ఢిల్లీలో బస్సులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల ప్యారామెడికల్ విద్యార్థిని కొందరు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులు ముఖేశ్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్‌కుమార్ సింగ్‌లకు సుప్రీంకోర్టు గత ఏడాది మరణశిక్షను ఖరారు చేసింది.