జాతకాల పిచ్చి... మూడో పెళ్లాం కోసం యువతి ప్రియుడిని చంపేసిన చెన్నై దోశ 'కింగ్'

శనివారం, 30 మార్చి 2019 (13:42 IST)
తమిళనాడులోనే కాదు.... మనదేశంతో పాటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో శరణభవన్ హోటల్ బ్రాండుకు వున్న పేరు అంతాఇంతా కాదు. ఆ హోటల్‌లో ఆహారపదార్థాలు ఎంతో రుచి. ఇప్పుడీ విషయం ఏంటయా అంటే... ఆ హోటల్స్ యజమాని పి.రాజగోపాల్‌కి జాతకాల పిచ్చి. దాంతో ఆల్రెడీ ఇద్దరు భార్యలున్నప్పటికీ ముచ్చటగా మూడోసారి మరో యువతిని పెళ్లి చేసుకుంటే వ్యాపారం ప్రపంచానికి విస్తరిస్తుందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. 
 
అంతే... వెంటనే తనవద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ కుమార్తె జీవనజ్యోతి జాతకం బహుబాగుగా కలిసిపోయిందని చెప్పడంతో ఆమెను తనికిచ్చి పెళ్లి చేయాలన్నాడు. ఐతే అప్పటికే ఆమె అదే సంస్థలో పనిచేస్తున్న ప్రిన్స్ శాంతకుమార్ అనే యువకుడి ప్రేమలో వుంది. దీనితో రాజగోపాల్ అభ్యర్థనను తోసిపుచ్చి శాంతకుమార్‌ను 1999లో పెళ్లి చేసుకుంది. ఆమె తన మాటను ఖాతరు చేయకుండా పెళ్లాడినందుకు ఆగ్రహంతో రగిలిపోయిన దోశ కింగ్... తక్షణమే ఇరువురూ విడాకులు తీసుకోవాలని బెదిరించాడు. 
 
ఐనా అతడి బెదిరింపులను పట్టించుకోలేదు వారు. దాంతో పక్కా ప్రణాళికతో 2001లో తన వద్ద పనిచేసే మరికొంతమంది సహకారంతో ప్రిన్స్ శాంతకుమార్‌ను మట్టుబెట్టించాడు. అప్పట్లో ఈ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దోశ కింగ్ రాజగోపాల్ దోషిగా తేల్చి అతడితోపాటు అతడికి సహకరించినవారికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 
 
ఐతే తను నిర్దోషినంటూ మద్రాసు హైకోర్టులో సవాల్ చేశాడు దోశ కింగ్. అక్కడా అతడికి చుక్కెదురైంది. కింది కోర్టు తీర్పునే హైకోర్టు సమర్థించింది. దీనితో తన ఆరోగ్యం సరిగా లేదంటూ బెయిల్ పైన బయటే వున్నాడు. ఎలాగైనా శిక్ష నుంచి తప్పించుకునేందుకు సుప్రీంకోర్టుకి వెళ్లాడు. కేసు వాదోపవాదాలను పరిశీలించిన సుప్రీంకోర్టు దోశ కింగ్ రాజగోపాల్ దోషేనని నిర్థారించింది. అతడు వచ్చే జూలై 7వ తేదీ లోపుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో తన జాతకాల పిచ్చితో ఓ యువకుడిని హతమార్చిన దోశ కింగ్ రాజగోపాల్ జైలు పక్షి కాక తప్పడంలేదు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బీజేపీ చీఫ్‌ అమిత్ షా సభకు జనాలు కరువు