ఈ రోజు, రేపు ఆకాశంలో ఓ అద్భుతాన్ని చూడొచ్చు. ఈ రోజు రేపు.... శని, గురు గ్రహానికి సమీపంలో చంద్రుడు వస్తాడు. దానిని బక్ మూన్ అని పిలుస్తారు. ఈ రోజు అంటే జులై 24న చంద్రుడు ఈ రోజు శనిగ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్తాడు. 25న గురు గ్రహానికి దగ్గరగా వెళ్లనున్నాడు. అంతేకాదు.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరైన రేఖలోకి వస్తాయని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడు ఒక 5 డిగ్రీలు కాస్త పక్కకి ఉండడం వల్ల సూర్యుడి కాంతి పూర్తిగా చంద్రుడి మీదే పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు చాలా కాంతివంతంగా కనిపిస్తాడు. ఇలాంటి చంద్రుడిని బక్ మూన్ లేదా థండర్ మూన్ అని పిలుస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా, జూలై పౌర్ణమి రోజు వచ్చే కాంతివంతమైన చంద్రుడిని బక్ మూన్ అని పిలవవచ్చు. మగ జింకల కొమ్ములు ఈ సమయంలో బాగా పెరుగుతాయని చెబుతుంటారు. ఈ పేరును అల్గాన్ క్విన్ తెగ వారు పెట్టారు. మగ బక్ డీర్స్ తమ కొమ్ములను జూలై సమయంలోనే పెంచుతాయి. పాతవి విరిగిపోయి ఈ సమయంలో కొత్తవి వస్తుంటాయట.
అంతేకాదు.. ఈ సమయంలో ఎక్కువ ఉరుములు, పిడుగులు కూడా పడుతుంటాయి కాబట్టి దీనిని థండర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ చందమామ రంగు కూడా తెల్లగా కాకుండా కాస్త ఎరుపు, నారింజ రంగుల కలయికలో ఉంటుంది. 24న అంటే ఈరోజు చంద్రుడు నాలుగు డిగ్రీల పాటు పక్కకు జరుగుతాడు. దాంతో శని గ్రహానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు.
ఈరోజు రాత్రి చంద్రుడు, శని గ్రహం రెండు కూడా పక్కపక్కనే మనకు ఆకాశంలో కనిపిస్తాయి. మరో నాలుగు డిగ్రీల పాటు జరిగి 25న గురు గ్రహానికి దగ్గరవుతాడు. ఈ రెండు గ్రహాలు కూడా సోమవారం తెల్లవారకముందు సమయంలో పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. వీటిని నేరుగా లేదా బైనాక్యులర్స్ సాయంతో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.