Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాకు షాకిచ్చిన మహారాష్ట్ర : రూ.5 వేల కోట్ల ఒప్పందాలు రద్దు

Advertiesment
చైనాకు షాకిచ్చిన మహారాష్ట్ర : రూ.5 వేల కోట్ల ఒప్పందాలు రద్దు
, సోమవారం, 22 జూన్ 2020 (16:22 IST)
సరిహద్దుల్లో ఉద్దేశ్యపూర్వకంగా ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు మహారాష్ట్ర తేరుకోలేని షాకిచ్చింది. చైనాతో కుదుర్చుకున్న మూడు ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ ఒప్పందాల విలువ రూ.5 వేల కోట్లు. 
 
లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశీయంగా చైనాపై వ్యతిరేకత పెరుగుతోంది. పైగా, చైనా వస్తువుల వాడకాన్ని నిలిపివేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న మూడు ఒప్పందాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో ఒక ఒప్పందం చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ (జీడబ్ల్యూఎం)తో కుదుర్చుకున్నారు. దీని విలువ రూ.3,770 కోట్లు. 
 
ఈ ఒప్పందం ప్రకారం పూణే సమీపంలోని తాలేగావ్‌లో చైనా సంస్థ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చైనాకు చెందిన ఫోటాన్ సంస్థ రూ.1000 కోట్లతో ఓ యూనిట్ ఏర్పాటు చేస్తే, 1500 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని భావించారు. మరో సంస్థ హెంగ్లీ ఇంజినీరింగ్ కూడా రూ.250 కోట్లతో తాలేగావ్ వద్ద తన ప్లాంట్‌ను విస్తరించాల్సి ఉంది.
 
ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగించలేమని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ వెల్లడించారు. ఒప్పందాల నిలిపివేత అంశంపై కేంద్రానికి కూడా సమాచారం అందించామని తెలిపారు. చైనా కంపెనీలతో ఇతరత్రా ఎలాంటి ఎంఓయూలు కుదుర్చుకోవద్దని భారత విదేశాంగ శాఖ కూడా సూచించిందని దేశాయ్ వెల్లడించారు.
 
అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు కూడా కఠిన నిర్ణయం తీసుకోనుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారుపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయనున్న రమేష్ కుమార్!?