Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మహా'నాటకం : మెజార్టీని రాజ్‌భవన్‌ నిరూపించలేదు.. తీర్పును రిజర్వు చేసిన సుప్రీం

'మహా'నాటకం : మెజార్టీని రాజ్‌భవన్‌ నిరూపించలేదు.. తీర్పును రిజర్వు చేసిన సుప్రీం
, సోమవారం, 25 నవంబరు 2019 (12:18 IST)
మహారాష్ట్ర రాజకీయాలు అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాత్రికిరాత్రే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై రెండు రోజులుగా వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు.. సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేసి, తుది తీర్పును మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెల్లడించనున్నట్టు ప్రకటించింది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'రాజ్‌భవన్ మెజార్టీని నిర్ణయించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని... శాసనసభలోనే బలపరీక్ష జరగాలని తెలిపింది.
 
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. 
 
అంతకుముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ఉదయం 5 గంటకు రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశ్నించారు. 
 
ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాలను విస్మరించిన కారణంగానే పొత్తులు చెడిపోయాయనీ... సిద్ధాంత పరంగానూ విబేధాలు ఉన్నాయన్నారు. తమకు మద్దతుగా 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ.. దీని తాలూకు అఫిడవిట్లు సైతం తమతో ఉన్నాయంటూ సిబల్ పేర్కొన్నారు. 
 
ఈ 154 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిగణనలోకి తీసుకుని 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని ఆయన సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. పైగా, సభలో అత్యంత సీనియర్ నేతను ప్రొటెం స్పీకర్‌గా నియమించి, ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. బల పరీక్ష ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని అభ్యర్థించారు. 
 
అయితే రాష్ట్రపతి పాలన ఎత్తివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు 154 మంది ఎమ్మెల్యే అఫిడవిట్లు తీసుకునేందుకు కూడా నిరాకరించింది. పిటిషన్లను ఇంతకుమించి పొడిగించవద్దని ధర్మాసనం సూచించడంతో... వీటిని ఉపసంహరించుకుంటున్నట్టు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. మంగళవారం బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలంటూ సింఘ్వీ సైతం సుప్రీంకోర్టును కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ మహిళా ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడతడు... వీడియో వైరల్