సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఓ ట్వీట్ చేశారు. అయితే, ఆయన తన అభిప్రాయాన్ని మాటల్లో వ్యక్తం చేయకుండా కేవలం ఓ వీడియోను పోస్ట్ చేసి వెల్లడించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది నెటిజన్లు రీట్వీట్ చేస్తూ, లైక్ చేస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా షేర్ చేసిన వీడియోలో ఇరు జట్ల మధ్య కబడ్డీ పోటీ జరుగుతోంది. ఓ జట్టు ఆటగాడు కూతకు వచ్చి ప్రత్యర్థి జట్టు ఆటగాడిని అవుట్ చేస్తాడు. వెళ్తూవెళ్తూ మధ్య గీత వద్ద ఆగి ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అవుటైన ఆటగాడు అతడి వద్దకు వచ్చి నిల్చుంటాడు. ధీమాగా నిల్చున్న ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఒక్కసారిగా పట్టుకుని తమవైపు లాక్కుంటాడు.
క్షణాల్లోనే అప్రమత్తమైన ఆటగాళ్లు వెంటనే అతడిని కదలకుండా పట్టుకుని పాయింట్ గెలుచుకుంటారు. దీంతో క్షణాల్లోనే ఆట తీరు మారిపోతుంది. పాయింట్ సంపాదించుకున్నట్టు కనిపించిన జట్టు అంతలోనే కోల్పోయింది. ఈ వీడియో మహారాష్ట్ర రాజకీయాలకు అతికినట్టు సరిపోతుందని పేర్కొంటూ ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.