టెలివిజన్ న్యూస్ ఛానెళ్లకు లీక్ అయిన ఒక వీడియో కర్ణాటక క్యాబినెట్ మంత్రి రమేష్ జార్కిహోలిని ఒక మహిళతో రాసలీలలు చేస్తున్నట్లు చూపించిన కొద్ది గంటల తరువాత, బిజెపి నాయకుడు ఈ వీడియో నకిలీది అని కొట్టి పారేశారు. తను నేరం చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాలను విడిచిపెడతానని పేర్కొన్నాడు.
రెండేళ్ల క్రితం జనతాదళ్ (సెక్యులర్)- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పతనం తరువాత బిజెపి ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వాన్ని సెక్స్ టేప్ కదిలించింది. “ఇది నకిలీ వీడియో. నాకు ఆ స్త్రీ ఎవరో కూడా తెలియదు. నేను మైసూరులో ఉన్నాను, చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళాను. ఆ వీడియో ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ మహిళతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆరోపించిన వీడియో గురించి స్పష్టత ఇవ్వడానికి నేను నా హైకమాండ్‌ను కలవబోతున్నాను.
ఈ ఆరోపణలు నాపై రుజువైతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలను విడిచిపెడతాను. ఇది నాపై తీవ్రమైన ఆరోపణ. నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను, నిందితులపై కూడా చర్యలు తీసుకుంటాను. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాలి” అని ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో సాగుతున్న జల వనరుల మంత్రి జార్కిహోలి విలేకరులతో అన్నారు.
భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సిడి విడుదలైంది. మార్చి 4 నుండి నెల రోజుల రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే క్రమంలో బెలగావి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు, బీదర్ జిల్లాలోని మాస్కీ, సిందాగి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కర్ణాటక సిద్ధమవుతోంది. జార్కిహోలి కర్ణాటకలోని గోకాక్ నుండి బిజెపి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బెలగావికి పార్టీ ఇన్‌చార్జిగా కూడా వున్నారు.
కాగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని లోబర్చుకున్నారని పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు ఆడియోను, వీడియో సీడీని అందజేశారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్‌కు ఫిర్యాదు చేసిన తరువాత కార్యకర్త దినేష్ కల్లాహల్లి ఈ సిడిని విడుదల చేశారు. సెక్స్ టేప్ ఆరోపణలపై బెంగళూరులోని కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి జార్కిహోలికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.