కరోనా లాక్‌డౌన్ ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల బాధలు వర్ణాతీతం. తిండి దొరక్క.. ఖాళీ కడుపుతో తిప్పలు పడుతున్నారు. బువ్వ కోసం ఓ వ్యక్తి చెత్తకుప్పను అంతా గాలించాడు. చివరకు హోటల్‌లో మిగిలిన భోజనం అక్కడ పడేయగా.. దాన్ని తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని ఆలూరు సమీపంలోని కోనేపీటేలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. రాజు(35) అనే వ్యక్తి ఆలూరులోని ఓ అల్లం పంట పొలంలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కర్ణాటకలో లాక్‌డౌన్ విధించడంతో.. అల్లం ఎగుమతికి ఆటంకం ఏర్పడింది. దీంతో రాజు జీవనోపాధికి కూడా అంతరాయం కలిగింది.
ఇక ఉన్న ఉపాధి కూడా పోవడంతో రాజుకు తినడానికి తిండి లేదు. ఉండడానికి గూడు లేదు. ఈ క్రమంలో ఆకలితో ఉన్న రాజు.. రోడ్డుపక్కన ఉన్న చెత్తకుప్పలో బుక్కెడు బువ్వ కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్న క్రమంలో ఓ హోటల్‌లో మిగిలిన భోజనాన్ని కవర్లలో ఉంచిన పొట్లాలు కనిపించాయి. అప్పటికే ఆ ఆహారం పూర్తిగా పాడైంది. అయినప్పటికీ ఆకలి తీర్చుకునేందుకు తినేశాడు.
దీన్ని గమనించిన సతీష్ అనే వ్యక్తి రాజును చేరదీశాడు. గత నాలుగు రోజుల నుంచి తనకు తిండి లేదు అని రాజు.. సతీష్‌తో చెప్పాడు. దీంతో తన స్నేహితుడి సాయంతో రాజుకు మంచి భోజనాన్ని అందించాడు సతీష్.
రాజుకు కొద్ది రోజుల వరకు షెల్టర్ ఇచ్చేందుకు ఆలూరుకు చెందిన ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ ముందుకొచ్చాడు. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 27 నుంచి మే 12వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే.
కర్ణాటకలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 44,438 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 239 మంది మరణించారు. దీంతో అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16.46 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 16,250కి చేరింది.