రాష్ట్రంలో ఒకే ఒక్క మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నామంటూ తెలుగుదేశం పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ సంబురాలు చేసుకుంటోంది. ఆ సంబురాలు ఆగక ముందే చైర్మన్ పదవికి ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి తెదేపా అధినేతలకు సునామీ షాకిచ్చారు. జేసీ దెబ్బతో పార్టీ నాయకులు షాక్ తిన్నారు.
అసలు ఏం జరిగిందయ్యా అంటే... మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎంపికైన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ మోహన్ రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి. తండ్రి వైఎస్ఆర్ లాగానే జగన్ మోహన్ రెడ్డిలో కూడా చాలా విలువలున్నాయి. వాటిని నేను ఈరోజు స్వయంగా చూశాను.
సీఎం జగన్ సహకారం లేకపోతే నేనిప్పుడు మునిసిపల్ చైర్మన్ అయ్యుండేవాడిని కాదు. త్వరలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తాననీ, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి పనిచేస్తానన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఇక ఆయన వైసిపిలో చేరడం ఖాయమని అంటున్నారు.
సోదరుడు ఎలాగూ అసలు విషయం చెప్పేశాడు కనుక జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్‌కు జై అనేస్తారని అంటున్నారు. మొత్తమ్మీద రాష్ట్రంలో ఏదో ఒక్క మునిసిపల్ స్థానం దక్కించుకున్నామన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు తెదేపాకి.