ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన హామీని రెండు రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజు వైఎస్ జగన్ నిర్ణయించగా.. ప్రత్యేక సీఎల్ లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా ఐదు సెలవులు మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సెలవులు మహిళా టీచర్లు, లెక్చరర్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు జీవో నెం.18ని విడుదల చేసింది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇందుకుగానూ సీఎం వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపాయి.