సోషల్ మీడియాకు ప్రస్తుతం వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఎలాంటి చిన్న శుభకార్యం జరిగినా వాట్సాప్‌లో ఆహ్వానించడం ఫ్యాషనైపోయింది. అలాంటిది పెళ్లంటే వీడియోలతో కూడిన ఇన్విటేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వాట్సాప్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి శుభలేఖలను పక్కనబెట్టి.. గుజరాత్ జంట వాట్సాప్ ఫార్మాట్‌లో వెడ్డింగ్ కార్డు కొట్టింది. శుభలేఖను వాట్సాప్ టైప్‌లో డిజైన్ చేసి బంధువులకు సర్‌ప్రైజ్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఆర్జూ, చింతన్‌ల పెళ్లి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనుంది. ఇందుకోసం వారు క్రియేటివ్‌గా వాట్సాప్ పెళ్లి కార్డును రెడీ చేసారు. వెబ్ డిజైనర్ అయిన చింతన్ కాబోయే భార్య ఇచ్చిన ఐడియాతో వారం రోజులు కష్టపడి ఇలాంటి క్రియేటివ్ కార్డును సిద్ధం చేశాడు.
కార్డు కవర్ మీద అన్ లాక్, వాట్సాప్ లోగోలో వినాయకుడు, వెర్షన్ ఇలా ప్రతిదీ సృజనాత్మకంగా వుండేలా ఈ కార్డును డిజైన్ చేశారు. ఇంకా పెళ్లికి రాకపోతే.. వాట్సాప్‌లో బ్లాక్ చేస్తాం అని చివర్లో నోట్ పెట్టడం అన్నిటికంటే హైలైట్‌గా నిలిచింది.