అమెరికాలో ఆర్థిక షట్‌డౌన్ కొనసాగుతోంది. మెక్సికో గోడ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు సెనెట్ నిరాకరించింది. దీంతో ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భీష్మించికూర్చొన్నారు. ఫలితంగా గత 27 రోజులుగా అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా మూతపడింది. ద్రవ్య బిల్లుకు అనుమతి దక్కకపోవడం వల్ల సుమారు 8 లక్షల మంది జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. అందులో ఆరు లక్షల మంది సీక్రెట్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. జీతాలు లేకుండా పనిచేస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆయన పిజ్జాలు తెచ్చి ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. మొత్తం ఆరు మంది సీక్రెట్ ఏజెంట్లు ప్రస్తుతం బుష్ వద్ద పనిచేస్తున్నారు. వారందరికీ ఆయన పిజ్జాలు తెచ్చి ఇచ్చారు. తాను, తన భార్య లారా కూడా ఏజెంట్లకు రుణపడి ఉన్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు మెక్సికో బోర్డర్ గోడకు నిధులు కేటాయిస్తేనే ద్రవ్య బిల్లుకు ఓకే చెబుతామని డోనాల్డ్ ట్రంప్ మొండికేశారు. దీనిపై ఆయన జార్జి బుష్ వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు.