ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ ఫక్తు రాజకీయ నేతగా మారిపోయాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న వాయు కాలుష్యంపై పార్లమెంటరీ స్థాయి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఓ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ హాజరుకాకుండా మరో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం ఇపుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. గంభీర్‌కు ప్రజా సమస్యల సమావేశానికి డుమ్మా కొట్టి ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతున్నారంటూ ఆప్ నేతలు మండిపడుతున్నారు.
ఈ విమర్శలపై గౌతం గంభీర్ గట్టిగా కౌంటరిచ్చారు. తన వ్యక్తిత్వ మేందో... తన పనితనమే నిర్ణయిస్తుందన్నారు. తన నియోజకవర్గంలో చేపట్టిన చెత్త నిర్వహణ, విద్యా వ్యవస్థ మొదలైన అంశాలను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్న దానిని ట్విట్టర్‌లో గంభీర్ పోస్టు చేశారు.
ఇక, వాతావరణ కాలుష్యంపై ఆయన స్పందిస్తూ, 'మా నియోజకవర్గంలో జాయింట్ ఏయిర్ ప్యూరిఫైయర్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్యాన్ని తగ్గించడానికి చర్చలు ప్రారంభించాం. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్‌ను కూడా ప్రారంభిస్తాం' అని చెప్పుకొచ్చారు.
మరోవైపు తాను ఎంపీగా కాకముందు, క్రికెటర్‌గా ఉన్న సమయంలోనే కొన్ని వాణిజ్య ప్రకటనలకు ఒప్పందం కుదుర్చుకున్నానని, వాటిని కూడా రాజకీయం చేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు.
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తనపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన నియోజకవర్గ ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని గంభీర్ ప్రకటించారు. తప్పుడు ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు నమ్మరని, తాను చేస్తున్న మంచి పనులనే చూస్తారని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, దేశ రాజధానిలో రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యంపై పార్లమెంటరీ స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గంభీర్ గైర్హాజరయ్యారు.
మరోవైపు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇండోర్ స్టేడియంలో గంభీర్‌తో కలసి ఉన్న ఫోటోలను పోస్టు చేయడంతో ఆమ్‌ఆద్మీ గంభీర్‌పై విరుచుకుపడింది. ప్రజా సమస్యల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయని విమర్శలు చేయడంతో గంభీర్ పైవిధంగా స్పందించారు.