Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

చైనాను కాళ్ల బేరానికి తెచ్చేలా కేంద్ర వ్యూహ రచన?!

Advertiesment
Galwan clash
, మంగళవారం, 23 జూన్ 2020 (11:36 IST)
లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ వద్ద చైనా బలగాలు విచక్షణాపూరితంగా చేసిన దాడిలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇకపై చైనా పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత్ ఓ నిర్ణయానికి వచ్చింది. చైనా బలగాల దూకుడుకు ధీటుగా స్పందించేలా భారత సైన్యానికి పూర్తిస్వేచ్ఛనిచ్చింది. 
 
ముఖ్యంగా, చైనా బలగాలు వాస్తవాధీన రేఖ సమీపంలోని పాంగాంగ్ సరస్సు, ఫింగర్-4 ప్రాంతాల్లో తిష్టవేసినట్టు గుర్తించారు. చైనా బలగాలను వెనక్కి పంపేందుకు సరిహద్దుల్లో సైనిక చర్య చేపట్టే దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో అన్ని సెక్టార్లలో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించాలని భావిస్తున్నారు. 
 
చైనా మెడలు వంచడానికి ఇదే సరైన సమయమని నిపుణులు పేర్కొంటున్న తరుణంలో, గల్వాన్ లోయ అంశంపై ఆ దేశాన్ని కాళ్ల బేరానికి తెచ్చేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం సైన్యానికి కట్టబెడుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
 
ప్రస్తుతం తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని మీటర్ల దూరంలోనే ఇరుదేశాల బలగాలు మోహరించి ఉన్నాయని తెలుస్తోంది. అటు గస్తీ పోస్టు-14, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనికులు బలప్రదర్శనకు దిగడంతోపాటు ఫిరంగులు, యుద్ధ ట్యాంకులు పెద్ద సంఖ్యలో మోహరించినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, వాస్తవాధీన రేఖ వద్ద మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనా బలగాలు భారీగా మోహరించాయి. ఇరువైపులా దాదాపు వెయ్యిమందికిపైగా సైనికులను మోహరించినట్టు తెలుస్తోంది. గాల్వన్‌లోని పెట్రోలింగ్ పాయింట్-14, పాంగాంగ్ టీఎస్ఓ వద్ద ఇరు దేశాల సైనికులు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుండడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
 
మరోవైపు, కీలక ప్రాంతాల్లో ఇరు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. అయితే, ఈ నెల 15 తర్వాత గాల్వన్‌ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ ఇరు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఇదిలావుంటే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్‌నాథ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యా సైనికాధికారులతో జరగనున్న విస్తృత చర్చల్లో పాల్గొనన్నారు. అలాగే, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియట్ యూనియన్ సైన్యం విజయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న కవాతులోనూ రాజ్‌నాథ్ పాల్గొననున్నారు. 
 
కాగా, రాజ్‌నాథ్ పర్యటనకు, చైనాతో వివాదానికి సంబంధం లేదని, రష్యాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్‌నాథ్ రష్యా పర్యటనకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా నిర్వహించనున్న విక్టరీడే పరేడ్‌లో భారత్, చైనా సహా 11 దేశాల సైనిక బలగాలు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా వస్తువులపై నిషేధం.. జాబితా తయారు చేస్తున్న కేద్రం??