Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త - భారీగా మొహరించిన ఇండో - చైనా బలగాలు

Advertiesment
India
, మంగళవారం, 23 జూన్ 2020 (10:54 IST)
వాస్తవాధీన రేఖ వద్ద మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనా బలగాలు భారీగా మోహరించాయి. ఇరువైపులా దాదాపు వెయ్యిమందికిపైగా సైనికులను మోహరించినట్టు తెలుస్తోంది. గాల్వన్‌లోని పెట్రోలింగ్ పాయింట్-14, పాంగాంగ్ టీఎస్ఓ వద్ద ఇరు దేశాల సైనికులు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుండడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
 
మరోవైపు, కీలక ప్రాంతాల్లో ఇరు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. అయితే, ఈ నెల 15 తర్వాత గాల్వన్‌ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ ఇరు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
 
మరోవైపు, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున సిక్కిం సమీపాన మంచుకొండల్లో సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికులు గొడవ పడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. లడఖ్ సమీపంలో ఇరు దేశాల మధ్యా గొడవలు చెలరేగి, ఇరుపక్షాల సైనికులూ మరణించిన కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. ఈ వీడియోలో చైనా మిలటరీ అధికారిపై భారత జవాను పిడిగుద్దులకు దిగినట్టు కనిపిస్తోంది. దాదాపు ఐదు నిమిషాల నిడివితో ఈ వీడియో ఉంది.
 
ఇరు పక్షాలూ "గో బ్యాక్", "డోంట్ ఫైట్" అంటున్న నినాదాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. నేలంతా మంచు నిండిపోయి కనిపిస్తుండగా, చైనా, భారత్ సైనికులు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. కొంతసేపటి తరువాత వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఎప్పటిదన్న విషయమై స్పష్టత లేదు. ఎవరు షూట్ చేశారన్న విషయం కూడా తెలియరాలేదు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.
 
ఇదిలావుంటే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్‌నాథ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యా సైనికాధికారులతో జరగనున్న విస్తృత చర్చల్లో పాల్గొనన్నారు. అలాగే, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియట్ యూనియన్ సైన్యం విజయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న కవాతులోనూ రాజ్‌నాథ్ పాల్గొననున్నారు. 
 
కాగా, రాజ్‌నాథ్ పర్యటనకు, చైనాతో వివాదానికి సంబంధం లేదని, రష్యాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్‌నాథ్ రష్యా పర్యటనకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా నిర్వహించనున్న విక్టరీడే పరేడ్‌లో భారత్, చైనా సహా 11 దేశాల సైనిక బలగాలు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధురైలో సంపూర్ణ లాక్ డౌన్.. 705కి పెరిగిన కరోనా కేసులు