చంద్రుడి దక్షిణ ధృవం అధ్యయనం నిమిత్తం భారత అంతరిపక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ -2 ప్రాజెక్టు ద్వారా పంపిన విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో హార్డ్ ల్యాండింగ్ ద్వారా కూలిపోయింది. అప్పటి నుంచి ఈ విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రో, అటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటంతో ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇక ఆ ప్రాంతానికి వెలుగు రావడంతో ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా, ఆ ఫోటోలను విడుదల చేసింది.
సెప్టెంబర్ 26వ తేదీన ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (ఎల్.ఆర్.ఓ) ల్యాండర్‌ను గుర్తించిందని నాసా పేర్కొంది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని తెలిపింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని తెలిపింది.
ఈ విక్రమ్ శిథిలాలను భారతీయ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ గుర్తించినట్లు నాసా చెప్పింది. విక్రమ్ గతితప్పిన వాయవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించాయి. ఎల్ఆర్‌వో తీసిన చిత్రాలను.. షణ్ముగ స్టడీ చేశారు.
తాజాగా నవంబర్‌లో తీసిన ఫోటోలను నాసా ఇంకా పరిశీలిస్తోంది. అయితే విక్రమ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాలను గుర్తించారు. ఫోటోల్లో ఆ శిథిలాల సైజు 2x2 పిక్సెల్స్‌గా ఉన్నాయి. విక్రమ్ పడిన ప్రాంతానికి సంబంధించిన రెండు ఫోటోలను నాసా అప్‌డేట్ చేసింది. విక్రమ్ కూలకముందు, కూలిన తర్వాత.. చంద్రుడి ఉపరితలంపై జరిగిన మార్పులను ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి చంద్రుడి దక్షిణ ధృవానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ల్యాండర్‌తో ఇస్రో సంకేతాలను కోల్పోయింది. లూనార్ ఆర్బిటార్ సెప్టెంబర్ 17వ తేదీన ఫస్ట్ మొజాయిక్ ఫోటోను రిలీజ్ చేసింది.
కానీ ఆ ఫోటోలో విక్రమ్ ఆచూకీ చిక్కలేదు. అయితే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్‌కు విక్రమ్ కూలిన ప్రాంతం కనిపించింది. ఆ తర్వాత ఎల్ఆర్‌వో టీమ్‌తో షణ్ముగ తన డేటాను షేర్ చేశాడు.
దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్‌వో విక్రమ్ పడిన ప్రాంతాన్ని గుర్తించింది. అక్టోబర్ 14, 15, నవంబర్ 11 తేదీల్లో తీసిన ఫోటోలను నాసా ఇమేజ్ సీక్వెన్స్ చేసింది. ఆ తర్వాత నవంబర్‌లో తీసిన ఫోటోలతో బెస్ట్ పిక్సెల్ క్లారిటీ వచ్చింది. దీంతో విక్రమ్‌ను గుర్తించినట్లు నాసా వెల్లడించింది.