కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై రోజుకో ఆరోపణ, రోజుకో వీడియో విడుదలవుతోంది. గతంలో ఆయన చేసినట్లు ఆరోపిస్తూ ఒక్కొక్కటి విడుదలవుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఇక ఎన్నో రోజులు వుండరేమోనన్న అనుమానం కలుగుతోంది. పైగా తాజాగా ఆయనపై ఓ అనర్హత ఎమ్మెల్యే చేసిన ఆరోపణ సంచలనమైంది. ఇంతకీ ఆ అనర్హత ఎమ్మెల్యే ఏమన్నాడో చూద్దాం.
తను కుమారస్వామి ప్రభుత్వం రద్దు కాకముందు ఓ రోజు ఉదయం 5 గంటలకు ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. యడియూరప్ప పిలుచుకురమ్మారని చెప్పడంతో అతడితో కలిసి నేను ఆయన వద్దకెళ్లాం. ఆ సమయంలో యడియూరప్ప పూజ చేస్తూ నేను రాగానే నావైపు చూసి కూర్చొమ్మని చెప్పారు.
పూజ ముగిశాక నవ్వుతూ తను మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతివ్వమని నన్ను అడిగారంటూ అనర్హత ఎమ్మెల్యే నారాయణ గౌడ తెలిపారు. ఐతే తను మద్దతివ్వాలంటే తన నియోజకవర్గ అభివృద్ధికి రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాననీ, మరో రూ. 300 కోట్లు కలిపి వేయి కోట్లిస్తానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఆరోజు అన్నట్లుగానే ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తనకు రూ. 1,000 కోట్లు ఇచ్చారనీ, అవన్నీ కర్ణాటకలోని తన నియోజకవర్గం క్రిష్ణరాజ్‌పేట్ ప్రాంతం అభివృద్ధి పనుల కోసం కేటాయించినట్లు చెప్పారు.