Publish Date: Mon, 11 Sep 2023 (23:18 IST)
Updated Date: Mon, 11 Sep 2023 (23:24 IST)
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డ సిల్వా కూడా భారత్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా లూయిస్ ఇనాసియో లులా డ సిల్వా మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తనకు ఎంతగానో నచ్చిందన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎస్ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ ఇష్టపడినంతగా మరే భారతీయ చిత్రం నచ్చలేదని అన్నారు.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మూడు గంటల నిడివిగల ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలు, అందమైన నృత్యాలు ఉన్నాయని లులా డ సిల్వా వివరించారు.
భారత్‌పై బ్రిటీష్ ఆధిపత్యంపై తీవ్ర విమర్శలను సినిమాలో అర్థవంతంగా చూపించారని కితాబిచ్చారు. అందుకే, "ఈ సినిమా చూసిన తర్వాత, నాకు తెలిసిన ప్రతి ఒక్కరినీ RRR సినిమా చూశారా అని అడిగాను. సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశాను. RRR దర్శకుడు, నటీనటులను నేను అభినందిస్తున్నాను." అంటూ పేర్కొన్నారు.
సెల్వి
Publish Date: Mon, 11 Sep 2023 (23:18 IST)
Updated Date: Mon, 11 Sep 2023 (23:24 IST)