తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం ఆరు గంటల సమయంలో అరెస్ట్ చేశారు.
చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇకపోతే.. అరెస్టయిన చంద్రబాబును రోడ్డు మార్గం ద్వారా విజయవాడ తరలిస్తున్నారు. చంద్రబాబు తన సొంత కాన్వాయ్‌లోనే విజయవాడకు వచ్చేందుకు సీఐడీ అధికారులు అంగీకరించారు.
చంద్రబాబు వెంట మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఉన్నారు. చంద్రబాబును ఈ మధ్యాహ్నం మూడో అడిషనల్ జిల్లా కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో, మరి కాసేపట్లో ఏపీ సీఐడీ డీజీ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై మాట్లాడతారని తెలుస్తోంది.