బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దీంతో 77 ఏళ్ళ అమితాబ్ వైరస్ బారినపడి కోలుకోవడంతో ఆయన అభిమానులతో పాటు.. భారతీయ సినీ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వైరస్ బారినపడ్డారు.
జులై 11వ తేదీన అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. 23 రోజుల పాటు ఆయన కరోనా చికిత్స తీసుకున్నారు. దీంతో ఆయన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అమితాబ్‌కు కొవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చినట్లు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కొవిడ్ నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి నాన్న డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బిగ్ బీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.
అమితాబ్‌కు కరోనా నెగిటివ్ ఫలితం వచ్చిందని జులై 23న సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఆ పుకార్లపై అమితాబ్ స్పందించారు. తనకు నెగిటివ్ ఫలితం రాలేదని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని స్పష్టత ఇచ్చారు.
నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన అనుభవాలని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఒంటరిగా ఉండడం వలన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దాని గురించి తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు బిగ్ బీ.
కోవిడ్ వార్డ్‌లో ఒంటరిగా ఉన్న నేను చలికి వణికిపోయాను. కళ్లు మూసుకుంటూ పాటలు పాడాను. నా చుట్టు పక్కల ఎవరు లేరు. చీకటి గదిలో ఉన్న రోగిని చూసేందుకు ఏ ఒక్క మనిషి కూడా రాడు. నర్సులు, డాక్టర్స్ మధ్య మధ్యలో వచ్చినా కూడా పీపీఈ కిట్లలో ఉన్న వారిని చూస్తుంటే రోబోలాగా కనిపిస్తున్నారు.
అక్కడ ఎక్కువ సేపు ఉన్నా కూడా వారికి ఎక్కువ సోకుంతుదనే భయం వెంటాడుతుంది. చికిత్స అందిస్తూ పర్యవేక్షించే వైద్యుడు రోగి దగ్గరకు వచ్చి చికిత్స చేయడు. వీడియో కాల్‌లోనే పర్యవేక్షిస్తారు అంటూ తన అనుభవాలు బ్లాగ్‌లో బిగ్ బి రాసుకొచ్చాడు.
అమిత్ షాకు పాజిటివ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఈ వైరస్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కరోనాకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో, కరోనా పరీక్ష చేయించుకున్నానని, దాంట్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లందరూ దయచేసి ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా సూచించారు.