సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల వివాదంతో అట్టుడుకిపోతోంది. అధికార సీపీఎం - బీజేపీ - ఆర్సెస్ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి రాజకీయంగా ఎంతో సమస్యాత్మకంగా మారిన కన్నూర్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామువరకు అనేక గృహాలు, దుకాణాలపై దాడులు జరిగాయి.
కన్నూర్ జిల్లా తలస్సేరిలో ఆదివారం తెల్లవారుజామున ఎన్జీవో(నాన్ గెజిటెడ్ అధికారుల) సంఘం నాయకుని ఇంటిపై బాంబులతో దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. అదే ఏరియాలో కొంతమంది బీజేపీ కార్యకర్తల ఇళ్ళపై కూడా దాడులు జరుగడంతో అధికారులు నిషేధాజ్ఞలను విధించాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలను నిర్వహించబోమని బీజేపీ, సీపీఎం నేతలు శనివారం జిల్లా అధికారయంత్రాంగం నిర్వహించిన శాంతి సమావేశంలో అంగీకరించారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ ఈ నెల 3వ తేదీన హర్తాళ్‌కు పిలుపు ఇచ్చిన నాటినుంచి శనివారం రాత్రి వరకు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 1,869 కేసులు నమోదు కాదు 5700 మందిని అరెస్టు చేశారు. కన్నూర్ జిల్లాలో 169 కేసులు నమోదుచేసి 230 మందిని, పాలక్కడ్ జిల్లాలో 166 కేసులు నమోదుచేసి 298 మందిని అరెస్టుచేసినట్టు ఆయన వివరించారు. మరోవైపు ఆందోళనకారులకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరికలు చేశారు.