శబరిమల అయ్యప్ప స్వామిని పది మంది మహిళలు దర్శనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి కేరళ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరిలో ఒకరు శ్రీలంక మహిళ ఉన్నారు. కానీ, తాజా సమాచారం మేరకు 10 మంది మహిళలు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక శాఖ థామస్ ఐజాక్ చెప్పారు.
తాజాగా రిపోర్టుల ప్రకారం తమిళ సంతతికి చెందిన ముగ్గురు మలేషియా మహిళలు కూడా జనవరి ఒకటో తేదీన అయ్యప్పను దర్శించుకున్నారు. కేరళ పోలీసులు దీనికి సంబంధించిన వీడియో కూడా తీశారు. ఆ మరుసటి రోజే బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి వెళ్లారు.
వీళ్లు కాకుండా మరో నలుగురు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారని మంత్రి వెల్లడించారు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయ్యప్పను దర్శించుకుంటామంటూ మొత్తం 4200 మంది 50 ఏళ్లలోపు మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు.