Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్ రాజ్యాంగబద్ధమే... కానీ తప్పనిసరికాదు : సుప్రీంకోర్టు

ఆధార్‌ జాతీయ గుర్తింపు కార్డు అని, దీంతో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని, దానివల్ల వారికి సాధికారిత వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రి అన్నారు.

ఆధార్ రాజ్యాంగబద్ధమే... కానీ తప్పనిసరికాదు : సుప్రీంకోర్టు
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:42 IST)
ఆధార్‌ జాతీయ గుర్తింపు కార్డు అని, దీంతో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని, దానివల్ల వారికి సాధికారిత వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రి అన్నారు. ఆధార్‌ కార్డు రాజ్యాంగబద్ధమైనదని స్పష్టంచేశారు. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
 
ఈ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపగా జస్టిస్‌ ఏకే సిక్రి మెజార్టీ తీర్పును చదివి వినిపించారు. ఆధార్‌తో నకిలీల సమస్య తొలిగిపోయిందని, మరోసారి ఆధార్‌ నమోదుకు వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందని, ఇదే ఆధార్‌ను ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందని సిక్రి వెల్లడించారు.
 
అయితే, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌‌కు అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్ గుర్తింపుకోసం బలవంతం చేయరాదని పేర్కొంది. అలాగే, స్కూళ్లు, ప్రయివేటు కంపెనీలు ఆధార్ కోసం ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా12 అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించింది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
 
కాగా ఆధార్ డేటా భద్రతపై అనుమానాలు అవసరంలేదనీ... ఇది పూర్తి సురక్షితమని, విశిష్టమైనదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం ఆధార్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. ఇటీవల సంవత్సరాల్లో ఆధార్‌పై విస్తృత చర్చ జరిగిందని... ఆధార్‌‌కార్డు ఉన్నతమైనది అనేకంటే విశిష్టమైనది అనడం సమంజసంగా ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ వ్యాఖ్యానించారు. డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పటిష్టమైన డేటా భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది.
 
ఆధార్ తప్పనిసరి చేయడం వల్ల రాజ్యాంగ ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లుతోందనీ.. సొంత ప్రజలపై నిఘా పెట్టినట్టు అవుతోందని పిటిషనర్ వాదించారు. ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేస్తూ కేంద్రం దాదాపు 139 నోటిఫికేషన్లు విడుదల చేసింది.. నాలుగు నెలల్లో దాదాపు 38 రోజుల పాటు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మే 10న తీర్పును రిజర్వ్‌లో ఉంచి బుధవారం తుది తీర్పును వెలువరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడికి సర్వస్వం అప్పగించింది... లండన్ వెళ్లగానే మాయమైపోయాడు... వచ్చి చూస్తే...